జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
…. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 9న జిల్లా పర్యటన సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
ఈ నెల 9వ తేదీన ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన తొమ్మిదో తేదీ ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఉంటుందని, తొలుత గ్రామ సభలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ, 56 అంశాలపై ఐవిఆర్ఎస్ సమాచారం ఆధారంగా ప్రజల సానుకూల స్పందనలో మొదటి పది స్థానాలు మరియు దిగువ పది స్థానాల్లో ఉన్న శాఖల పనితీరుపై సమీక్ష, పార్టీ కేడర్ మీటింగ్, పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రజల సానుకూల స్పందనపై ఆయా శాఖాధికారులు పూర్తిస్థాయి సమాచారం, తాజా గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్, గృహ నిర్మాణం, ప్రజా రవాణా శాఖలు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆచంట నియోజకవర్గంలో గత మూడు వారాలుగా నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ, హెలిపాడ్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే వరి ఉప ఉత్పత్తులు, స్థానిక ఫుడ్ ప్రొడక్ట్స్ తదితర అంశాలతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలు, రైతులు, మహిళలకు అల్పాహారం, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు వంటి అంశాల్లో సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కూడా ఆదేశించారు.
ఈ సమావేశంలో డీపీఓ వై. దోసిరెడ్డి, డ్వామా పీడీ కె.సి.హెచ్. అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి యు. మంగపతిరావు, డీసీహెచ్ పి. సూర్యనారాయణ, ఎల్‌డీఎం నాగేంద్రప్రసాద్, డీఎంహెచ్ఓ జి. గీతాబాయి, సీపీఓ కె. శివపార్వతి, స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు అధికారి ఎ. వెంకటలక్ష్మి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.