జూన్ 7 నుంచి 14 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు
ప్రతిష్టాత్మకంగా జూన్ 21న యోగాంధ్ర@2026
వెయ్యి మందితో జిల్లా కేంద్రంలో భారీ యోగా ఈవెంట్స్
జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో జూన్ 13, 14 తేదీలలో “అథ్లెటిక్స్ & స్పోర్ట్స్ గ్రూప్స్” థీమ్‌తో ప్రత్యేక యోగా కార్యక్రమాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో యోగాంధ్ర-2026 కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో యోగాంధ్ర-2026 నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 7వ తేదీ నుంచి 14 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రతి వర్గానికీ యోగాను చేరువచేయాలని సూచించారు. జూన్ 21న జిల్లా కేంద్రంలో వెయ్యి మందితో భారీ యోగా ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా సెషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా “అథ్లెటిక్స్ అండ్ స్పోర్ట్స్ గ్రూప్స్” థీమ్‌తో ప్రత్యేక యోగా ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 13న నరసాపురం వలందర్ రేవు ప్రాంగణంలో, జూన్ 14న వాసవి పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో 500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యోగా ట్రైనర్లతో పాటు మరింత మందిని శిక్షణ ఇచ్చి యోగా శిక్షకులుగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమాలను పార్కులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు మరియు జిల్లాలకు రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పర్యాటక, క్రీడా, విద్యాశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.