Close

జూన్ 6 నుండి జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Publish Date : 04/06/2025

బుధవారం జిల్లాలో నిర్వహించనున్న మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జూన్ 6వ తేదీ నుండి జూన్ 30 వరకు 23 రోజులు పాటు ఐదు సెంటర్లలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పరీక్షలకు 16,634 మంది హాజరుకానున్నారని, మూడు సెషన్స్ లో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. సబ్జెక్టుల వారీగా మొదటి సెషన్ ఉ.9.00 గం.ల నుండి మరియు ఉ.9.30 గం.ల నుండి ప్రారంభమై మ.12.00 గంటలకు ముగుస్తుందని, రెండవ సెషన్ మ.2.00 గం.ల నుండి మరియు 2:30 గం.ల నుండి ప్రారంభమై సా.5.00 గం.లకు ముగుస్తుందని, మూడవ సెషన్ సా.4.00 గం.ల నుండి 5.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దంతులూరు నారాయణరాజు కాలేజీ, తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, నరసాపురంలో స్వర్ణాంధ్ర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మొత్తం ఐదు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు పదిమంది డిపార్ట్మెంటల్ అధికారులను, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ 5 సెంటర్ల నందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను కూడా మూసి ఉంచాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని రవాణా శాఖకు తెలిపారు. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, సెంటర్ల యాజమాన్యంతో మాట్లాడి జనరేటర్ లను కూడా ఏర్పాటు చేయించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందికి విధులను కేటాయించి అవసరమైన మందులను, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ను సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణ, త్రాగునీటి వసతి ఏర్పాటుకు మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల సమయానికి ముందు, తర్వాత ఆర్టీసీ బస్సులు తిరిగేలా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఏ విధమైన లోటుపాట్లను ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరించారు. ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం జరుగుదని స్పష్టం చేశారు. హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, తదితర ఏదో ఒక ఫోటో ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.

త‌ప్పులు స‌రిదిద్దుకొనే అవ‌కాశం ఉంది
డిఎస్‌సి హాల్‌టిక్కెట్‌లో ఏమైనా త‌ప్పులు న‌మోదై ఉంటే స‌రిదిద్దుకొనే అవ‌కాశం ఉంద‌ని, వాటికోసం అభ్య‌ర్ధులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఏదైతే త‌ప్పు న‌మోద‌య్యిందో, దానికి సంబంధించిన ఒరిజ‌న‌ల్ స‌ర్టిఫికేట్ ను చూపించి, ధృవీక‌రించిన దాని జెరాక్స్ కాపీని అంద‌జేసి, ప‌రీక్షా కేంద్రంవ‌ద్దే స‌రిచేసుకోవ‌చ్చున‌ని చెప్పారు. త‌ప్పులు స‌రిచేయించుకొనేవారు గంట ముందుగానే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడం ఉండరాదు అన్నారు. పూర్తిగా తనిఖీని అనంతరమే పరీక్ష కేంద్రం లోనికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలు మీరి ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డిఇఓ ఇ.నారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎన్.సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్.ఇ ఎ.రఘునాథ్ బాబు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం అధికారులు, వైద్యశాఖ, రవాణా శాఖ అధికారులు, హెడ్మాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.