Close

జూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి పూర్తి స్థాయి సన్నద్ధత ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 10/06/2026

వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి విద్యాశాఖకు సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ల అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సుమారు రెండు నెలలపాటు పాఠశాలలు మూసివేయబడినందున పాఠశాల ఆవరణల్లో అపరిశుభ్రత, మొక్కల పెరుగుదల, చెట్ల కొమ్మలు విరిగిపడటం, విషపురుగులు, పాములు, జెర్రీలు సంచరించే అవకాశం ఉందన్నారు. హెడ్ మాస్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీపీఓలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకుని పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు. అలాగే పాఠశాల భవనాల్లో స్లాబులు, పెచ్చులు ఊడిపోవడం, గోడలు బీటలు వారడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పాఠశాల ప్రారంభం రోజునుండే నిరాటంకంగా అమలుకావాలని తెలిపారు. అందుకు అవసరమైన బియ్యం, నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్లు తదితర సామగ్రి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముందుగానే సిద్ధంగా ఉంచాలని డీఎస్ఓ మరియు సివిల్ సప్లయిస్ అధికారులను ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులు పూర్తి ఫిట్నెస్‌తో ఉండేలా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జిల్లా రవాణా అధికారికి సూచించారు. డ్రైవర్లకు కూడా ఆరోగ్య మరియు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేలా పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్థుల రవాణాలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 11న నరసాపురం వలందరు రేవులో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా జూన్ 14 మరియు 19 తేదీల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం వరకు ప్రతిరోజు నిర్వహించే యోగా కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. యోగాపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు యోగా పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించేలా ప్రోత్సహించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు అంగీకారం తెలిపిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు.

ఈ జూమ్ కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, డీపీఓ వై.దోసిరెడ్డి, డీఎస్ఓ ఎన్.సరోజ, సివిల్ సప్లయిస్ డీఎం ఎండి ఇబ్రహీం, డీటీవో కృష్ణారావు, జిల్లా ఆయుష్ అధికారి శ్రీరామ్, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.