జిల్లా రెడ్ క్రాస్ సేవలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ అందుకున్న సందర్భంగా సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా అధికారులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు తొలుత జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి పుష్ప గుచ్చాన్ని అందజేసి, మాట్లాడుతూ జిల్లాలో 2024 – 25 సంవత్సరంలో రూ.36 లక్షలు వివిధ శాఖలు సభ్యత్వ రుసుము ద్వారా అందజేయడం జరిగిందని, వినూత్నంగా ప్రభుత్వ శాఖలచే రక్తదాన శిబిరాలు ఏర్పాటు, రూ.3 కోట్లతో బ్లడ్ బ్యాంక్, డేకేర్ తలసేమియా సెంటర్ ఏర్పాటు తదితర రెడ్ క్రాస్ సేవలలో పాలుపంచుకున్నందుకు జిల్లా గోల్డ్ మెడల్ ను సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుండి నడిపించిన మన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందనీయులన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో జిల్లా రెడ్ క్రాస్ కు సేవలందిస్తున్న జిల్లా, డివిజన్, మండల అధికారులు, రెడ్ క్రాస్ సభ్యుల సమిష్టి కృషితో జిల్లాకు గోల్డ్ మెడల్ ను సాధించడం జరిగిందని, ఇది వారందరి విజయం అన్నారు. అత్యధిక రెడ్ క్రాస్ సభ్యత్వం రుసుము డిఆర్డిఏ రూ.5,22,531, జిల్లా గ్రామపంచాయతీ రూ.4,26,250, భీమవరం తహసిల్దార్ రూ.2,71500, పరిశ్రమల శాఖ రూ.2,41,000, తాడేపల్లిగూడెం తహసిల్దార్ రూ.2,00,100 వసూలు చేసినందుకు ఆయా శాఖల అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. వీరితోపాటు 37 శాఖలు రెండు లక్షల రూపాయలు లోపు సభ్యత్వ రుసుమును వసూలు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఏ జిల్లాలో లేని విధంగా వినూత్నంగా ప్రతి శాఖచే ప్రతి నెల మొదటి, మూడవ శుక్రవారం రెండు బ్లడ్ బ్యాంక్ క్యాంపులను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ప్రమాదాలు, గర్భిణీ స్త్రీలు, తల సేమియా బాధితుల అవసరాల కోసం ప్రతి ఏడాది 25వేల యూనిట్లు రక్తం అవసరం కాగా 19 వేల యూనిట్లు మాత్రమే సిద్ధం చేయగలిగామన్నారు. ప్రతినెల 3 వేల యూనిట్లు నుండి 6 వేల యూనిట్ల రక్త సేకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సంభవించిన వరదలు సమయంలో రెడ్ క్రాస్, సత్య సాయి సేవలు ప్రశంసించ దగినవన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా, డివిజన్, మండల అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివన్నారాయణ రెడ్డి, డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎమ్మెస్ ఎస్ వేణుగోపాల్, ఐసీడీఎస్ పిడి బి సుజాత రాణి, గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతా బాయి, డిఇఓ ఇ.నారాయణ, ఏపీసి శ్యాంసుందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.