Close

జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై విద్యార్థిగా మారిన వేళ

Publish Date : 19/12/2024

ఉండి మండలం పాందువ్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ఎంతమంది చదువుకుంటున్నారు, హై స్కూల్ చదువుకు ఎక్కడికి వెళ్తున్నారు, ఒక కుటుంబంలోని పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారా, వేరువేరుగా చదువుకుంటున్నారా తదితర సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటే తరువాతి తరగతులు సులభంగా చదవగలుగుతారని ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో పిల్లలకు విద్యతో పాటు, మంచి అలవాట్లను నేర్పాలని సూచించారు. చిన్నతనంలో వారికి నేర్పిన విద్య, అలవాట్లు జీవితకాలం గుర్తు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులతో పాటు బెంచ్ మీద కూర్చుని వారితో పాఠాలు చదివిస్తూ, తప్పులు సరిచేస్తూ విద్యార్థులతో మమేకమవడం అక్కడ ఉన్న వారిని అందరిని సంతోషపరిచింది.

అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులను పేరులను అడిగి తెలుసుకుని వారితో పాటలు పాడించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నారులు కూడా బెదురు లేకుండా పాటలు పాడటంలో ఉత్సాహాన్ని చూపించడం జిల్లా కలెక్టర్ ను సంతోషపరిచింది. మెనూ ప్రకారం ఆహారాన్ని తప్పకుండా అందించాలని అంగన్వాడి టీచర్లకు సూచించారు. అంగన్వాడి భవనం సరిగ్గా లేనందున మరొక ప్రదేశంలోకి మార్చాలని తెలిపారు. అనంతరం నిర్మాణం పూర్తయి సచివాలయాన్ని పరిశీలించారు. స్విచ్ బోర్డులు ఏర్పాటు, తదితర చిన్న, చిన్న పెండింగ్ పనులను పూర్తిచేసి వెంటనే ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు.

మార్గం మధ్యలో కాలనీ పరిశీలన..
అనంతరం ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిశీలనకు బయలుదేరిన సమయంలో మార్గం మధ్యలో కొందరు మహిళలు జిల్లా కలెక్టర్ వాహనాన్ని ఆపి మా కాలనీలో డ్రైనేజీ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మా గృహాలను కేటాయించడం జరిగిందని, అప్పటినుండి ఇప్పటివరకు డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రజాప్రతినిధులకు, స్పందనలో తెలియజేసిన ఇంతవరకు పరిష్కారం కాలేదని కలెక్టర్ కు విన్నవించడంతో, జిల్లా కలెక్టర్ కారు దిగి స్వయంగా కాలనీ వాసులతో కలిసి నడిచి వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితిని పరిశీలించడం జరిగింది. డ్రైనేజీ ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఎంపీడీవోను ఆదేశించడం జరిగింది.

ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన సందర్భంలో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి పాఠశాల ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, రిజల్ట్ ఎలా ఉంది తదితర విషయాలను ప్రధానోపాధ్యాయురాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకు వడ్డించే మధ్యాహ్న భోజన పదార్థాలను ఆర్డిఓ, డీఈవోలతో కలిసి జిల్లా కలెక్టర్ రుచి చూశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వంద రోజుల యాక్షన్ ప్లాన్ తొమ్మిదో తరగతి విద్యార్థుల నుండే అమలు చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1918లో నెలకొల్పిన ఈ పాఠశాల ఎంతో విశిష్టమైనదని, ఇటీవల పాఠశాలను స్థానిక శాసనసభ్యులు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రత్యేక చొరవతో మౌలికల వసతులను అభివృద్ధి చేయడం జరిగిందని, దీనికి తగిన విధంగా విద్యార్థులకు మంచి విద్యను అందించి ప్రయోజకులు అయ్యేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు.

ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ వెంట భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఇఓ ఈ.నారాయణ, తహసిల్దార్ కె.నాగార్జున, ఎంపీడీవో ఎస్.రవీంద్ర, ఎంపీటీసీ సాగిరాజు సుజాత, ఎంఈఓ బి.వినాయకుడు, జ్యోతి, ప్రధానోపాధ్యాయులు పి.వి. సత్యనారాయణ రాజు, వై.రామలక్ష్మి, తదితరులు ఉన్నారు.