జిల్లా అధికారులు తమ ఉద్యోగులతో పాటు, అనుబంధ సంస్థల ఉద్యోగులలో రక్తదానంపై అవగాహన కల్పించాలి–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
భీమవరం జిల్లా కలెక్టరేట్ లో డిసెంబర్ 12న రక్తదాన శిబిరం నిర్వహణ
సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో 2026వ సంవత్సర వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 2025 డిసెంబర్ 1 నుండి 2026 నవంబర్ 30 వరకు సంవత్సర పొడవునా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నెలలో 1వ మరియు 3వ శుక్రవారం ఒకొక్క శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం మొదటి రక్తదాన శిబిరం డిసెంబర్ 12, 2025న జిల్లా కలెక్టరేట్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తమ ఉద్యోగులతో పాటు అనుబంధ సంస్థల ఉద్యోగులను కూడా రక్తదానానికి ప్రోత్సహించాలని సూచించారు. గత సంవత్సరం జిల్లాలో రక్తదాన శిబిరాలలో ప్రభుత్వ ఉద్యోగులు 1,166 యూనిట్లు రక్తాన్ని దానంగా అందజేశారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, విద్య, డ్వామా, డీఆర్డీఎ, కార్మిక శాఖల అధికారులు, సిబ్బంది చురుకుగా పాల్గొని, రక్తదానంలో విశేషంగా సహకరించినందుకు జాయింట్ కలెక్టర్ ఆయా శాఖాధికారులను అభినందించారు. రక్తదానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సంవత్సరం నిర్దేశించిన 2,000 యూనిట్ల లక్ష్యం చేరుకునేందుకు అధికారులు సిబ్బంది తమ వంతు సహకరించాలని కోరారు. ఈ రక్త సేకరణ ద్వారా తలసేమియా రోగులు, రక్తహీనత బాధితులు మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రాణదానం చేసిన వారు అవుతామన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, డ్వామా పీడి డాక్టర్ కే సి హెచ్ అప్పారావు, జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ డాక్టర్ భద్రి రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.