Close

జిల్లాలో శిశు జనన రేటు పెరిగే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .

Publish Date : 16/07/2025

మాతృ, శిశు ఆరోగ్యం కోసం గర్భధారణ, బిడ్డకు, బిడ్డకు మధ్య అంతరంపై దంపతులకు అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలి.

జూలై 11న నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం దంపతులు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని దానివల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతుందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జనాభా పెరుగుదల అవసరతను ప్రస్తావించడం జరిగిందన్నారు. మాతృ, శిశు ఆరోగ్యం కోసం గర్భధారన, బిడ్డకు, బిడ్డకు మధ్య అంతరం పై దంపతులకు అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలు కాన్పులు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు అవసరమైన మందులు, వైద్య చికిత్స, పౌష్టికాహారం ఉచితంగా అందించడం జరుగుతుందని, వీటిని క్రమం తప్పకుండా అందించేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కౌమార దశలో వివాహం, గర్భం దాల్చడం వలన వచ్చే ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. కాన్పు జరిగిన తరువాత తల్లి, బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండేందుకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మంచి వాతావరణం కల్పించి పిల్లలకు పౌష్టికాహారం అందించే విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఈ సందర్భంగా ప్రణాళిక బద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం మరియు అంతరం, మేము పిల్లలం – అప్పుడే కాము తల్లులం “ఇక చాలు ఆపండి “అనే రెండు గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులుమీదగా ఆవిష్కరించారు.

చివరగా ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని వివిధ విభాగాల్లో లక్కీ డిప్ ద్వారా ఎంపికైన పదిమంది తల్లులకు నగదు పూరష్కరాలను, ఎక్కువ గర్భనియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యులకు, ఆరోగ్య పద్ధతులపై ప్రోత్సహించిన మోటివేటర్స్ కు జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా మెమొంటోలను అందుచేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. జి.గీతాబాయి, డి సి హెచ్ ఎస్ డా.పి
సూర్యనారాయణ, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ సుధా లక్ష్మి, డి ఈవో ఇ.నారాయణ, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, ఐ సి డి ఎస్ పి.డి. డి.లక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ముగ్గురు పిల్లలు తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తల్లులు, పురుషులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.