జిల్లాలో వంట నూనెలు, నిత్యవసర వస్తువులు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి–. ….జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
వ్యాపారస్తులు వంట నూనెలు, పప్పులు కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.
రైతు బజార్లో అమ్మే కూరగాయల ధరలు కన్నా బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు అమ్మకాలు జరిపే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి
కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు బుధవారం జిల్లా పౌర సరఫరాలు, జిల్లా ప్రణాళిక శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు, వంట నూనెలు, పప్పులు హోల్‌సేల్ రిటైల్ వ్యాపారస్తులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వంట నూనెల ధరలు, పప్పులు, కూరగాయల ధరల పెరుగుదలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వివిధ మండలాలలో వంటనూనెలు హోల్ సేల్, రిటైల్ ధరల వ్యత్యాసం, కందిపప్పు, ఎండుమిర్చి హోల్ సేల్ రిటైల్ అమ్మకాలపై వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రేడ్ వన్ కందిపప్పు కిలో రూ.130 – 132, పామాయిల్ కిలో రూ.115, ఎండుమిర్చి రూ.250 – 260 ధరలకు మించి అమ్మకూడదని ఎక్కడైనా అధిక ధరలకు అమ్మినట్లయితే జిల్లా పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. గత సంవత్సరం కన్నా కందిపప్పు, పామాయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని వర్తకులు జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు. వంట నూనెల ప్యాకెట్లు వివిధ కొలమానాలు, వివిధ ధరలతో మార్కెట్లో ఉండడంవల్ల వినియోగదారులకు అర్థం కావడం లేదని వ్యాపారస్తులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తగు పర్యవేక్షణ చేయాలని పౌరసరఫరాల అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వంట నూనెలు, పప్పులు సరిపడినన్ని నిల్వలు మార్కెట్లో ఉన్నాయని వినియోగదారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేయనవసరం లేదని జాయింట్ కలెక్టర్ సూచించారు.
జిల్లాలో భీమవరం, పాలకొల్లు, నరసాపురం రైతు బజార్లు నిర్వహణలో ఉన్నాయని, ప్రతి నియోజకవర్గంలో ఒక రైతు బజారు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు బజార్లలో కూరగాయల ధరలు గత మాసం కన్నా తక్కువగానే ఉన్నాయని, అన్ని రకాల కూరగాయలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని మార్కెటింగ్ శాఖ అధికారి జాయింట్ కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా కూరగాయలు అధిక ధరలకు విక్రయాలు జరిగినట్లు తెలిస్తే తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అలాగే, నిత్యావసర వస్తువుల ధరలపై వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో వంటనూనెలు, నిత్యవసర వస్తువుల ధరలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎన్.సరోజ, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి కె.సునీల్ కుమార్, సిపిఓ కె.శివ పార్వతి, ఎస్టేట్ అధికారి పి.కళ్యాణ్, వివిధ మండలాల నుండి హోల్ సేల్, రిటైల్ వర్తకులు, తదితరులు పాల్గొన్నారు.