జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయి రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడవద్దు
సహజ సిద్ధంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులు వాడాలి
తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆలపాటి వెంగన్న వ్యవసాయ క్షేత్రం వద్ద శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. యంత్రాల ద్వారా వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని యంత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఉపయోగాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనులను కూలీలతో చేయడం వలన శ్రమ, ఖర్చు, ఎక్కువ సమయం పడుతుందని, యాంత్రికరణ పద్ధతుల్లో చేయడం వలన శ్రమ, ఖర్చు, సమయం ఆదా అవుతుందని,పంట దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని రైతులకు వివరించారు.
జిల్లాలో అధికంగా దువ్వ గ్రామంలో మిషన్ల ద్వారా ప్లాంటేషన్ ఎక్కువ జరుగుచున్నయని కూలీల కొరత అధికమవటం వలన వ్యవసాయ యాంత్రికరణ మరింత ప్రోత్సహించాలని, ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాలను ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని రైతులు కోరారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ సాగులో రసాయన ఎరువులు అధికంగా వాడవద్దు అన్నారు. సహజ సిద్ధముగా తయారుచేసిన సేంద్రీయ ఎరువులు పచ్చిరొట్ట వంటివి వాడాలని రైతులకు సూచించారు. అందువలన సాగు ఖర్చు తగ్గి రైతుకు ఆదాయం పెరుగుతుందని అన్నారు. భూమి సారవంతంగా తయారై ఆరోగ్యం మైన పంటను చేతికి అందిస్తుందని అన్నారు. జీవన ప్రమాణమైన ఎరువులు ఎలా వాడాలి ఆత్మ ప్రాజెక్టు ద్వారా డెమో చూపించి రైతులకు వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల రైతులకు ఉత్పాదక పెరుగుదల సమయం శ్రమ ఆదాయం కలిసి వస్తాయని అన్నారు. ఒక రైతు వ్యవసాయ సాగుకు సంబంధించి రిజిస్టర్లో నమోదు చేసిన ఖర్చులును జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ వల్ల రైతులకు ఉత్పాదకత పెరుగుదల, సమయం, శ్రమ ఆదా, కూలీల కొరత తీరడం, పంటల నాణ్యత మెరుగు పడడం సాగు ఖర్చులు తగ్గడం, మరియు ఆదాయం పెరగడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్నారు. అధిక దిగుబడిని సాధించడానికి, ఆహార భద్రతను పెంచడానికి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచడం జరిగింది రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రైతులు కంగారుపడి యూరియా నిల్వ పెట్టుకోవద్దని ఎప్పటికప్పుడు సొసైటీలు షాపులు ద్వారా అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఎమ్మార్పీ రేట్లు కంటే ఎక్కువ రేట్లు అమ్మినట్లు ఎక్కడైనా సమాచారం ఉంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్ర, మండల వ్యవసాయ శాఖ అధికారి కే రాజేంద్రప్రసాద్, తాహసిల్దార్ వర్మ, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండేటి శివ, నీటి సంఘం అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు, దువ్వ పీఏసీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఆర్ఎస్కే సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.