జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలు,వసతి గృహాలలో విద్యార్థులకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలి. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో అందరికీ ఇల్లు సర్వే, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు, తల్లికి వందనం, ఈ కేవైసీ అంశాలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ ఇల్లు సర్వేలో ఇప్పటి వరకు 2,206 మంది నమోదు చేసుకున్నారని గతంలో ఇచ్చిన పట్టాలు తాలూకు 24,351 కూడా ఈ సర్వేలో వచ్చేలా చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేలా లబ్ధిదారులను జల్లెడ పట్టాలన్నారు. ముఖ్యంగా శానిటేషన్ వర్కర్ల అందరికీ ఇల్లు మంజూరుకు వారు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థిని, విద్యార్థులకు పరిశుభ్రమైన త్రాగునీరు అందే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిశుభ్రమైన త్రాగునీరు అందించకపోతే దాని ప్రభావం విద్యార్థుల ఆరోగ్యంపై పడుతుందన్నారు. మండల, జిల్లాస్థాయి అధికారులు పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి తాగునీరు, విద్యుత్ సరఫరా, తదితర మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలన్నారు. జిల్లాలో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత పై అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా బహిరంగంగా చెత్త తగలబెట్టకూడదన్నారు. చెత్త తెగల పెట్టడం ద్వారా వాతావరణ సమతుల్యం దెబ్బతిని అనేక రోగాలు సంభవిస్తాయన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలను ఏడు స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంజనీరింగ్ సిబ్బంది ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్టాక్ పాయింట్ల నుండి ఇసుకను తీసుకోవాలన్నారు. తల్లికి వందనం సంబంధించి పెండింగ్ లో ఉన్న 1,465 కేసుల కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, డి ఆర్ డి ఏ పిడి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, డిఎం అండ్ హెచ్ ఓ జి.గీతా బాయి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి జి.పిచ్చయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.