జిల్లాలో మొదటి విడతలో 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు 1,062 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

Publish Date : 15/11/2026
WhatsApp Image 2026-11-15 at 3.24.08 PM

జిల్లాలో మొదటి విడతలో 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

1,062 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆచంట, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఐదు మండలాల్లో 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆదివారం పెనుగొండ మండలంలోని పెనుగొండ, సిద్ధాంతం గ్రామ పంచాయతీలతో పాటు పెనుమంట్ర మండలంలోని ఆలమూరు గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ సందర్శించి, ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో ఆచంట నియోజకవర్గ పరిధిలోని ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర మండలాలతో పాటు నరసాపురం నియోజకవర్గ పరిధిలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో మొత్తం 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
మొత్తం 1,006 వార్డులకు సంబంధించి 1,062 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అన్నారు.
ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు.
నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు అనుగుణంగా ప్రతి నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు .
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు .
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు కె. కృష్ణయ్య, ఉంగరాల నాగేశ్వరరావు, తహసీల్దార్లు జి. అనిత కుమారి, టి రాజరాజేశ్వరి,ఎంపీడీవో
టి.సూర్యనారాయణమూర్తి, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.