Close

జిల్లాలో మేలు జాతి పువ్వుల సాగుకు విరివిగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.

Publish Date : 21/01/2025

సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెరవలి మండలం కాపవరం గ్రామంలో సాగు చేస్తున్న ఆర్కిడ్ (డెకరేటివ్ పూల సాగు) వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, సాగుదారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుండి సాగు చేస్తున్నారు, మొక్కలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎకరం విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు పడతాయి, ఎంత ఖర్చవుతుంది, ఎంతమంది పనిచేస్తున్నారు, ఒక స్టెమ్ ఖరీదు ఎంత పడుతుంది, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్కిడ్ వ్యవసాయ క్షేత్రం మేనేజర్ కెటికీన శ్రీనివాస మంగరాజు ఆర్కిడ్ సాగుపై వివరిస్తూ 2016 సంవత్సరంలో థాయిలాండ్ నుండి మొక్కలను కొనుగోలు చేయడం జరిగిందని, 45 రోజులు వీటిని క్వారెంటెన్ లో ఉంచి కేంద్ర పరిశోధన సంస్థ తనిఖీ చేసి ఎన్ఓసి జారీ అనంతరం వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక షెడ్లులో పందేళ్లపై ప్లాస్టిక్ కుండీలలో కొబ్బర పీచు మధ్య (ఏ విధమైన మట్టిని వినియోగించరు) నాటి, వీటికి సంబంధించిన ద్రావణాలను పిచికారి చేయడం జరుగుతుందని తెలిపారు. వీటి సాగుకు పందిళ్ళ దిగు భాగాన నీటి మడుగులను, పందేళ్ళ పై భాగంలో. స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఎల్లప్పుడు చల్లని వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుందన్నారు. ఒక ఎకరాకు సుమారు 45 వేల మొక్కలను నాటుకోవచ్చని, నాటుకోవడానికి మొదటి సంవత్సరం మొక్కల కొనుగోలు, పందిళ్లు ఏర్పాటు, తదితర ఏర్పాట్లకు సుమారు 60 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నాటిన సుమారు 8 నెలల కాలం నుండి ఆర్కిడ్ ఫ్లవర్స్ కోతకు వస్తాయని ఒక్కొక్క స్టెమ్ సుమారు ధర రూ.20/- నుండి రూ.25/- మధ్య ఉంటుందని, నెలకు ఒక ఎకరాకు రూ.5 లక్షలకు పైబడి ఆదాయం వస్తుందన్నారు. సంవత్సర కాలానికి సుమారు రూ.60 లక్షల ఆదాయాన్ని గడించడం జరుగుతుందని తెలిపారు. ఒకసారి మొక్క నాటుకున్న తర్వాత తిరిగి మళ్ళీ కొనుగోలు చేయవలసిన అవసరం లేదని అవే మొక్కలు ఫార్మింగ్ చేయటం జరుగుతుందని, ఆ మొక్కలను ఇతరులకు అమ్ముతామని తెలిపారు. మావద్ద 30 ఆర్కిడ్ రకాలు ఉన్నాయని, ఆరు సంవత్సరాలు పైబడి ఆర్కిడ్ వ్యవసాయం చేస్తున్నట్లు వివరించారు. ఆర్కిడ్ ఫ్లవర్స్ ను చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, పూణే, బెంగుళూర్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతుందని, అలాగే స్వరాష్ట్రంలో కాకపర్రు, కాకినాడ తదితర ప్రాంతాల డెకరేటర్స్ ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉద్యానవన శాఖ అధికారులతో మాట్లాడుతూ ఆర్కిడ్ సాగుకు జిల్లాలోని రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. పెరవలిలోని ఆర్కిడ్ సాగు క్షేత్రాన్ని సందర్శించి సాగు వివరాలను తెలియజేయడానికి రైతులను సమీకరించి టూర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్కిడ్ పూల సాగుకు ప్రభుత్వం సుమారు రూ.32 లక్షల సబ్సిడీని అందజేస్తుందని, సబ్సిడీ వివరాలను కూడా రైతులకు వివరించాలన్నారు. బిందు సేద్యం కింద స్ప్రింక్లర్లు కొనుగోలుకు కూడా సబ్సిడీ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని రైతులను ఉద్యానవన పంటల సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావడానికి దోహదపడుతుందన్నారు. తుఫాన్లు, వరదలు వంటి పకృతి వైపరీత్యాల వలన వరి, తదితర పంటలు నష్టపోతున్నారని, ఆర్కిడ్ల సాగుతో ఇటువంటి ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారులు మరింత శ్రద్ధగా పనిచేసి రైతులను పువ్వుల సాగుకు మళ్లించేలా కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్.దేవానంద్ కుమార్, జిల్లా సూక్ష్మ బిందు సేద్యం అధికారి పి.వీరభద్రరావు, తణుకు తహసిల్దార్ డి వి వి ఎస్ అశోక్ వర్మ, మున్సిపల్ కమిషనర్ టి.రవికుమార్, హార్టికల్చర్ అధికారి కె.ప్రియదర్శని యాదవ్, ఆర్కిడ్ మేనేజర్ కెటికిన శ్రీనివాస మంగరాజు, డొక్కా తాతాజీ, తదితరులు ఉన్నారు.