జిల్లాలో మార్గదర్శకుల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
మానవ సేవే…… మాధవ సేవ…
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం… కష్టాలలో ఉన్న వారికి మనోధైర్యం కల్పించడం కూడా సమాజసేవలో భాగమే.
పి4 లో భాగంగా మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్ చదలవాడ నాగరాణి పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా, సామజికంగా బలోపేతం చేసేందుకు పి4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. సమాజంలో సంపన్నులు (మార్గదర్శకులు) పేద, బలహీన వర్గాలవారిని (బంగారు కుటుంబం) దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. సమాజం ద్వారా సంపన్నులుగా ఎదిగిన వారు పేదలను ఆదుకోవడం ద్వారా సమాజ సేవ చేసిన వారు అవుతారన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాలో మార్గదర్శకులుగా నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, జిల్లా అధికారులు అందరూ విధిగా మార్గదర్శకులుగా నమోదు కావాలని, అదేవిధంగా డివిజనల్ స్థాయి అధికారులు కూడా మార్గదర్శకులుగా నమోదుకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా శాఖల పరిధిలో డివిజనల్, మండల స్థాయి అధికారులు తమ స్థాయి మేరకు పేద కుటుంబాలను ఆదుకోవడానికి తప్పనిసరిగా చేర్పించాలని సూచించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, కష్టాల్లో ఉన్నవారికి మంచి మాటలు, మనోధైర్యం కల్పించినా అది కూడా సమాజ సేవలో భాగమే నన్నారు. కావున, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, సిపిఓ కె.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డ్వామా పి.డి కేసిహెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.