Close

జిల్లాలో మాతృ, శిశు మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించిన, ప్రతినెల ఒక మరణం నమోదవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Publish Date : 05/11/2025

బుధవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన మాతృ మరణాలు, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకూడదనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించిన, ప్రతినెల ఒక మరణం నమోదు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత సమావేశంలో సమీక్షించిన సందర్భంలో మాతృ, శిశు మరణాలకు కారణమైన కొన్ని ప్రవేట్ హాస్పిటల్స్ పై తీసుకోమన్న చర్యలు ఏమయ్యాయి అని వైద్య శాఖ అధికారిని ప్రశ్నించారు. కుటుంబానికి మహిళ మూల స్తంభం అని, ఆమె చనిపోతే కుటుంబం మొత్తం చిన్న భిన్నం అవుతుందన్నారు. పిల్లలు విద్యకు దూరం కావడం తదితర సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తుతాయన్నారు. జిల్లాలో జీరో మాతృ, శిశు మరణాలు ఉండేలాగా కృషి చేయాలి అన్నారు. 2025-26 సంవత్సరం రెండో క్వార్టర్ లో జరిగిన ఒక మాతృ మరణం, రెండు శిశు మరణాలకు గల కారణాలను సుదీర్ఘంగా సమీక్షించారు. బాధిత కుటుంబ సభ్యులతో కూడా స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. కొన్ని కేసులలో ప్రైవేట్ హాస్పిటల్స్ గర్భిణికి ప్రసూతి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలలో నిర్లక్ష్యం కానవస్తుందన్నారు. సాధారణ ప్రెగ్నెన్సీ కేసును ఎలా ట్రీట్ చేయాలి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసును ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే వ్యత్యాసాన్ని పూర్తిగా కేస్ స్టడీ ద్వారా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే వైద్యాన్ని అందించాలని, వారికి అనుకూలంగా లేని కేసులను వేరే హాస్పిటల్స్ కు రిఫర్ చేయాలని సూచించారు. గొల్లవాని తిప్ప అనాకోడేరు గ్రామం నివాసి కె.కృప ప్రసూతి మరణంపై సమీక్షిస్తూ చాలా హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రీట్ చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో చివరి వరకు వేచి చూడకుండా గర్భం దాల్చిన నాటి నుండే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ గర్భవతి అయితే ఇబ్బంది ఉన్నప్పుడు వారికి ముందే అవగాహన కల్పించాలని ఆదేశించారు. భీమవరం మండలం చిన్న రంగడిపాలెం నివాసి కె.సౌమ్య యొక్క శిశువు మరణం, తాడేపల్లిగూడెం మెట్టుపర్రు గూడెం నివాసి సిహెచ్ రత్నకుమారి యొక్క శిశువు మరణాలపై ఈరోజు సమావేశంలో సమీక్షించడం జరిగింది.

ఈ సమావేశంలో కమిటీ మెంబర్ కన్వీనర్ మరియు డిఎంహెచ్వో డాక్టర్ బి. గీతా బాయి, కమిటీ మెంబర్లు డిసిహెచ్ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డి ఐ ఓ డాక్టర్ దేవ సుధాలక్ష్మి, భీమవరం ఏరియా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి కళ్యాణి, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ స్వర్ణకుమారి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ జి.పద్మ, డాక్టర్ సాయి కిరణ్మై, ఎఫ్ ఓ జి ఎస్ ఐ డాక్టర్ ఐ.లక్ష్మి, డిప్యూటీ సీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వరప్రసాద్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, ఐ సి డి ఎస్ పిడి డి.శ్రీలక్ష్మి, 104 కోఆర్డినేటర్ కృష్ణంరాజు, వివిధ ప్రవేట్ హాస్పిటల్స్ డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

2.11