జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
జిల్లాలో రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పిడుగుపాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
భారీ వర్షాల కారణంగా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదు, వెళ్లిన వాళ్లు అక్టోబర్ 24 సాయంత్రం లోపుగా ఒడ్డుకు చేరుకోవాలి..
భారీ వర్షాలు నేపథ్యంలో రేపు అక్టోబర్ 24 శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటన
శిథిలావస్థలో ఉన్న గృహలలోని వారు అప్రమత్తంగా ఉండాలి
వర్షంలో విధ్యుత్ స్తంభాలను తాకరాదు.
ప్రజల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్ 08816-299219 ఏర్పాటు
గండి పడే అవకాశం ఉన్న కాలువలు, చెరువులు, నదీ పరివాహ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలు పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఉన్నత అధికారులకు తక్షణం సమాచారం అందించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు. చెరువులు, నదులు వాటి ప్రవాహం ఆధారంగా దాటుటకు, ఈదుటకు ప్రయత్నించవద్దని సూచించారు. వర్షాలు ఉన్నప్పుడు, తర్వాత కూడా తాగునీరు కలుషితం కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ స్థంబాలు, కరెంట్ షాక్ కు అవకాశం ఉన్న వాటిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ స్థంబాలు, చెట్లు వంటివి పడినపుడు తక్షణం తొలగించాలని అన్నారు. గర్భిణీలు, అత్యవసర వైద్య సేవలు అవసరం ఉన్నవారిని తక్షణం ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. అత్యవసర శస్త్ర చికిత్సలకు విద్యుత్ అంతరాయం ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సముద్రంలోకి వేటకు ఎవరు వెళ్లవద్దని, వేటకు వెళ్ళిన వారు అక్టోబర్ 24 లోపుగా ఒడ్డుకు చేరుకోవాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు. భారీ వర్షాలు నేపథ్యంలో రేపు అక్టోబర్ 24 శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
పిడుగుపాటుపై ప్రజల్లో అవగాహన పిడుగుపాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, నీటి వసతులకు దగ్గరగా ఉండకుండా అందరికీ సమాచారం అందించాలని అన్నారు. రియల్ టైమ్ సమాచారం వస్తుందని, దానిని ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08816-299219 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు సమాచారం అందించవచ్చని, సమాచారం పొందవచ్చని తెలిపారు.