Close

జిల్లాలో ప్రజల డిమాండ్ కు అనుగుణంగా రానున్న వర్షాకాలం కంటే ముందుగా అన్ని నియోజకవర్గాల్లో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 15/04/2025

మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఆర్డీవోలు, డిటిఓ, మండల రెవెన్యూ అధికారులు, ఇసుక స్టాక్ పాయింట్స్ నిర్వహణ ఏజెన్సీదారులు, ట్రాన్స్పోర్ట్ వాహన యజమానులతో ఇసుక సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్ లు అందుబాటులో లేనందున రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి కొరత లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా పెండ్యాలలో ఓపెన్ ఇసుక రీచ్ ని పశ్చిమగోదావరి జిల్లాకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లాకు 5 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించుకొని రానున్న వర్షాకాలం కంటే ముందుగా ప్రతి నియోజకవర్గంలో 70 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను డంపు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని రవాణా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని నియోజకవర్గం ప్రధాన కేంద్రాలలో భీమవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఉండి, తాడేపల్లిగూడెం స్టాక్ యార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు సుమారు 60 ట్రక్కులకు తక్కువ కాకుండా జిల్లాకు ఇసుక రవాణా చేపట్టాలన్నారు. ఇసుక రీచ్ నుండి జిల్లాలో వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు ఇసుక లోడ్ వాహనాలు రాకపోకలు కొనసాగుతాయని, వరి మాసూళ్ళు ముమ్మరంగా జరుగుచున్నందున రోడ్లపై ఆరబెట్టుకునే రైతులతో అధికారులు ముందస్తుగా మాట్లాడి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇందుకు తగిన ఏర్పాట్లను పూర్తిచేయాలన్నారు. పెండ్యాల రీచ్ వద్ద ర్యాంపు నిర్మాణం, సైట్ నిర్వహణ, అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎక్కువ సమయం లేనందున పెండ్యాల ఇసుక రీచ్ నందు ఇసుకను త్రవ్వి లోడింగ్ చేసేందుకు నియమించిన ఏజెన్సీ సాధ్యమైనంత వేగంగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి బి.రవికాంత్, ఆర్టీవో ఉమామహేశ్వరరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి కె.గంగాధర్, ధవలేశ్వరం గోదావరి రివర్ కన్జర్వేటర్ ఈఈ ఆర్.కాశీ విశ్వేశ్వరరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ ఎస్.రమేష్, తహాసిల్దార్లు పాలకొల్లు వై.దుర్గా కిషోర్, భీమవరం రావి రాంబాబు, ఉండి కె.నాగార్జున, తాడేపల్లిగూడెం ఎం.సునీల్ కుమార్, తణుకు డి వి ఎస్ అశోక్ వర్మ, ఆచంట కనకరాజు, నరసాపురం ఐతం సత్యనారాయణ, ఏజెన్సీలు, టిప్పర్స్ యజమానులు, తదితరులు పాల్గొన్నారు.