Close

జిల్లాలో పోలీసెట్ ప్రవేశ పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Publish Date : 30/04/2025

బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం విష్ణు కాలేజీ బి.సీతా పాలిటెక్నిక్ కాలేజీ నందు ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు పరీక్షలు రాయడాన్ని స్వయంగా పరిశీలించారు. విష్ణు కాలేజీ సెంటర్ కు ఎంతమందిని కేటాయించారు, ఎంతమంది హాజరయ్యారు తదితర వివరాలను చీఫ్ కోఆర్డినేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పోలీసెట్ -2025 ప్రవేశ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటులను చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 18 సెంటర్లలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, వీటిలో భీమవరంలో 4, తాడేపల్లిగూడెంలో 2, తణుకులో 8, నరసాపురంలో 4 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లాలో 4,354 మంది విద్యార్థులు, 2,917 మంది విద్యార్థినులు మొత్తం 7,254 మంది పోలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 6,489 మంది పరీక్షలకు హాజరయ్యారని, 782 మంది పరీక్షలకు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఆయా సెంటర్లో పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, వేసవిని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలు, త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలిసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణను పూర్తిచేసిన అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు.

ఈ సందర్భంలో చీఫ్ కోఆర్డినేటర్ సిహెచ్ నల్లపు రాజు, సహాయ కోఆర్డినేటర్ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.