జిల్లాలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసిరావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీరో పావర్టీ పీ4పై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ భీమవరం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించి తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగాస్వాములు అవుతారని చెప్పారు. అందరిలో చైతన్యం నింపేలా మరింత మంది సంపన్నులు మార్గదర్శులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహద పడుతుందని అన్నారు.0 పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీనిని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలను అన్ని చోట్లా అమలు చేసి చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని నిర్దేశించారు. ప్రవాసాంధ్రులను కూడా భాగస్వామం చేసేందుకు ఏపీ ఎన్నార్టీ సొసైటీ సాయం తీసుకోవాలని చెప్పారు. అలాగే కార్పొరేట్ సంస్థలు దీనికి కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు. ఒకవేళ స్థానికంగా మార్గదర్శులు లేకపోతే అప్పుడు స్థానికేతరులను అనుసంధానం చేయాలని నిర్దేశించారు. పీ4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు రాష్ట్రస్థాయిలో దాతలు ముందుకు వస్తే వారిచ్చే నిధుల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించవచ్చని సీఎం స్పష్టం చేశారు.
మార్గదర్శులుగా 57,503 మంది నమోదు
ఆగస్ట్ 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను ‘మార్గదర్శులు’ దత్తత తీసుకునేలా చూడాలని మరోసారి అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని, విశాఖపట్నం జిల్లా ఈ విషయంలో చివరిన ఉందని వెల్లడించారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫామ్‌ల ద్వారా పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తొలుత I Am A Maragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ మార్గదర్శకుల రిజిస్ట్రేషన్ ను వేగవంతం చేయాలన్నారు. పిఫోర్ అమల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సెక్టార్లవారిగా సమావేశాలను ఏర్పాటు చేసి మార్గదర్శకులు ముందుకొచ్చేందుకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, సిపిఓ కె.శ్రీనివాసరావు, డ్వామా పిడి డాక్టర్ కేసిహెచ్ అప్పారావు, డి ఆర్ డి ఎ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.