Close

జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులను చేపట్టి పని దినాలను కల్పించడంతోపాటు, తద్వారా మౌలిక వసతులకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Publish Date : 02/04/2025

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, డెల్టా జిల్లా అయినప్పటికీ రెట్టింపు పని దినాల కల్పనతో జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లాలో 1,81,101 జాబ్ కార్డులు నమోదుకాబడ్డాయన్నారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 39 లక్షల పని దినాలు లక్ష్యం కాగా 37.71 లక్షల పని దినాలు కల్పించి 96.69 శాతానికి పైగా లక్ష్యం సాధించి పని కోరిన 1,02,792 కుటుంబాలకు పని కల్పించడం జరిగిందన్నారు. దీనిలో ఎస్సీ వర్గాలకు 28.66 శాతం, ఎస్టీ వర్గాలకు 0.87 శాతం, మహిళలకు 55.45 శాతం పని దినాలను కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 2,611 దివ్యాంగులకు జాబ్ కార్డులు ఉండగా పని కోరిన 1,344 మందికి పని కల్పించబడిందన్నారు. కుటుంబానికి సగటున 36.68 రోజుల ఉపాధి కల్పించగా, 100 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు 4,239 ఉన్నాయని, రాష్ట్ర సగటు వేతన రేటు రూ.255.55/- లు ఉండగా, జిల్లాలో వేతన రేటు రూ.268.46/- లుగా నమోదయిందన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు చెల్లించిన వేతనాలు రూ.101.23 కోట్లు కాగా, మెటీరియల్ వ్యయం రూ.44.82 కోట్లు, జీతభత్యాలు నిర్వహణ మొదలగు పరిపాలన వ్యయంతో కలుపుకొని మొత్తం రూ.152.68 కోట్లు వ్యయం చేయడం జరిగిందన్నారు.

2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం నిధులతో మొత్తం 33 వేల పనులు చేపట్టగా, 25 వేల పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని, వీటిలో ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్, మేజర్, మైనర్, డిస్ట్రిబ్యూటరీ చానల్స్ లో పూడికతీత ప్రాజెక్టు కింద సుమారు 20వేల కిలోమీటర్ల పొడవైన పూడికతీత పనులు చేపట్టడం ద్వారా సాగునీటి అడ్డంకులను తొలగించడం జరిగిందన్నారు. అలాగే పండ్ల తోటల భూముల్లో రింగ్ ట్రెంచ్ త్రవ్వకం పనులు చేపట్టి ఉపాధి కల్పనతో పాటు పండ్ల తోటలకు నీటి ఎద్దడి తగ్గించడం జరిగిందన్నారు. త్రాగునీటి చెరువులు, సాగునీటి చెరువులు, పశువుల చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడం ద్వారా పని దినాల కల్పనతో పాటు, త్రాగు సాగు నీటి లభ్యత మరింత సులభతరం చేయడం జరిగింది. పండ్ల తోటల పెంపకం ప్రాజెక్టు కింద 162 ఎకరాల్లో కొబ్బరి మామిడి జామ మొదలగు పంటలకు ప్రోత్సాహం ఇచ్చి ఎస్సీ ఎస్టీ. సన్న- చిన్న కారు రైతుల జీవనోపాధి మెరుగుపరచడం జరిగిందన్నారు. బ్లాక్ ప్లాంటేషన్ క్రింద 58.3 ఎకరాల్లో కొబ్బరి మొక్కల పెంపకం విస్తృతంగా చేపట్టి చెరువుగట్లను బలోపేతం చేయడమే కాకుండా గ్రామపంచాయతీలకి ఆదాయ సమకూర్చడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 53.66 కిలోమీటర్ల పొడవున సిసి రోడ్లు, 1.36 కి.మీ విఐపిఎం రోడ్లు, 2.80 కి.మీ బి.టి రోడ్లు నిర్మించి మొత్తం 348 పనులు పూర్తి చేసి సుమారు రూ.29.68 కోట్ల చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. అలాగే 772 పశువుల షెడ్లు నిర్మాణం చేపట్టి నేటి వరకు 497 పనులు పూర్తి చేసి రూ.4,29,32,050/- ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇంకా జిల్లా మొత్తం 8,519 వివిధ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

2025 26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచ ప్రాధాన్యాలలో భాగంగా జిల్లాలో 40 లక్షల పని దినాల లక్ష్యసాధనతో పాటు మూగ జీవాలకు 140 నీటి తొట్టెలు నిర్మించుటకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో అంచనాలు తయారు చేసి ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ ద్వారా నిర్మాణ ప్రాంతాల గుర్తింపు జరుగుతుందని తెలిపారు. అదే విధంగా 20 వేల కిలోమీటర్ల పొడవైన పూడికతీత పనులు, 200 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం పనులు, పశుగ్రాస పెంపకం పనులు, త్రాగునీటి సాగునీటి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని, ప్రభుత్వం గుర్తించిన వేతనం రూ.307/- లు సాధించే దిశగా, మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ లక్ష్యాలను విజయవంతం చేయడానికి కృషిచేసిన డ్వామా పిడి డాక్టర్ కెసిహెచ్ అప్పారావు, ఎంపీడీవోలు, అదనపు ప్రోగ్రాం అధికారులకు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ లకు, టెక్నికల్ అసిస్టెంట్ లకు, బేర్ పూట్ టెక్నీషియన్లకు, క్షేత్ర సహాయకులకు, మేట్లు అందరికీ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఎన్ ఆర్ జి ఎస్ పనుల లక్ష్యాలకు మించి సాధించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ కోరారు.