Close

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 18/09/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కెవిఐబి అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు వివిధ వర్గాలను సమాయాప్తపరచడంతో పాటు ప్రోత్సాహక దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు మంజూరు చేసిన పరిశ్రమలను స్థాపించారా, ఉత్పత్తి కొనసాగుతుందా, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు తదిత వివరాలను అందజేయాలన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే స్థిరమైన వృద్ధిరేటు సాధించగలమన్నారు. దీనినిలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఏ విధమైన ప్రోత్సాహాకాలను పొందగలరో రాయితీపై భూమి, స్టాంప్ డ్యూటీ రాయితీ, లీజు పద్ధతి, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరిలకు ప్రత్యేక రాయితీలు, తదితర వివరాలపై విస్తృత సమాచారాన్ని అందించాలన్నారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ బోర్డ్ ఉండే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను పరిశీలించాలన్నారు. కె వి ఐ బి ద్వారా పీఎంఈజీపి కింద సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ రుణాలను మంజూరు చేయాలని సూచించారు.

జిల్లాలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని జిల్లా పర్యాటకశాఖ అధికారిని ఆదేశించారు. సామాజిక మౌలిక వసతులు పెంపొందించే దిశగా జిల్లాలో కొత్త హోటల్స్ ఏర్పాటుకు ఉన్న అంశాలను పరిశీలించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కొత్త హోటల్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో తరచూ ప్లేస్మెంట్ డ్రైవ్ లను ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. 2024 నుండి నేటి వరకు ఎన్ని ప్లేస్మెంట్ డ్రైవ్ లను ఏర్పాటు చేశారు, ఎంతమంది ఎంపిక అయ్యారు, ఎంతమంది ఉద్యోగాలలో పనిచేస్తున్నారు తదితర వివరాలను అందజేయాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారిని ఆదేశించారు. చదువుకున్న ఏ ఒక్కరు నిరుద్యోగులుగా ఉండకూడదనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. ఐటిఐలో అప్ గ్రేడేషన్ స్కీం స్కిల్ హబ్ అండ్ స్పోక్ మోడల్ ను అమలు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్, జిల్లా పర్యటక శాఖ అధికారి ఏ.వి.అప్పారావు, ఉండి ఐటిఐ ప్రిన్సిపాల్ ఆనంద్ వేణు గోపాల్, కె.వి.ఐ.బి అధికారి ఆనంద్, ఎంప్లాయిమెంట్ యంగ్ ప్రొఫెషనల్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ పీ.వీ సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.