Close

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 19/04/2025

శనివారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. వివిధ పరిశ్రమల స్థాపనకు అందిన ధరఖాస్తులను అన్ని శాఖలు నిర్ణీత గడువులోపుగా అనుమతులను మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహకాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అదే దిశగా జిల్లాలో కూడా పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా జిల్లా ఆర్థిక అభివృద్ధికి దోహద పడేలా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల స్థాపనతో ఎక్కువమందికి ఉపాధి అవకాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపపై అవగాహన పెంపొందించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని తెలిపారు.

జిల్లాలో పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్షిస్తూ గత నెల మార్చి 20వ తేదీ నుండి ఇప్పటివరకు వివిధ శాఖల నుండి అనుమతుల కోసం 52 దరఖాస్తులు అందగా 42 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, మరో 10 దరఖాస్తులు పరిష్కరించవలసి ఉందన్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సాహం కింద 19 మంది దరఖాస్తుదారులకు వివిధ సబ్సిడీల కింద 27, 04,656 రూపాయలు మంజూరుకు అనుమతించడం జరిగిందన్నారు. జిల్లాలో అసంఘటిత కార్మికులకు పి ఎం జె జె బి వై, పి ఎం ఎస్ బి వై పథకాల కింద ఇన్సూరెన్స్ చేయించి వారికి ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. వేసవి దృష్ట్యా వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదే విధంగా చిన్న చిన్న షాపుల్లో అనేకమంది సిబ్బంది పనులు చేస్తుంటారని వేసవి దృష్ట్యా షాపుల్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్స్ ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, జిల్లా పంచాయత్ అధికారి బి.అరుణ శ్రీ, జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్.వి.ఎస్.వి ప్రసాద్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఎన్ ప్రసాద్, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎ.రఘునాథ్ బాబు, జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్ వి ఎస్ ప్రసాద్, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి కె.గంగాధర్ రావు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇ.ఇ కె.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.