Close

జిల్లాలో పరిశ్రమలు, సేవా రంగాల విస్తరణ ద్వారా జిడిపి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నించేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 25/09/2025

ఔత్సాహికవేత్తలు నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని, మౌలిక వసతులు కల్పన మా బాధ్యత..

గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించడం జరిగింది. తొలుత పరిశ్రమల స్థాపనకు ఉత్సాహం చూపిస్తున్న ఔత్సాహికవేత్తల అభిప్రాయాలను, ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా విద్యుత్ లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ, భూమి తదితర అంశాలను సమావేశంలో ప్రస్తావించగా, విద్యుత్ లైన్ ల ఏర్పాటును రానున్న 40 రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రంగాలకు సంబంధించిన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని, పరిశ్రమల స్థాపనకు సొంత భూమి కలిగిన యజమానులతో భాగస్వామ్యంగాని, లేదా బ్రాండెడ్ కంపెనీలతో టై అప్ చేసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సహకారం అందిస్తుంది అన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికవేత్తలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. పర్యాటక రంగం, ఫర్నిచర్, గార్మెంట్స్ విభాగాలలో ఏకో టూరిజం ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పలువురు పేరుపాలెం బీచ్, కేపీ పాలెంలలో రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఇన్వెస్టర్లను అభినందిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రింట్ అండ్ ప్యాకింగ్ క్లస్టర్, టెక్స్టైల్స్ క్లస్టర్, ఫర్నిచర్ క్లస్టర్ల నుండి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక వ్యక్తిగా కాకుండా ఒక గ్రూపుగా ఏర్పడి వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వారు చేస్తున్న కృషికి కలెక్టర్ అభినందించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో యూనో ఫీడ్స్, పరివర్తన ఇంజనీరింగ్, మరనాత ఇండస్ట్రీస్, వెంకటరమణ స్టీల్ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ, హరిత సహస్ర రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్, హర్షిత్ బీచ్ రిసార్ట్స్, వి కన్వెన్షన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో సంతృప్తికరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ, పరిశ్రమలు, సేవా రంగాల్లో ప్రగతి వెనుకంజలో ఉందన్నారు. ఎక్కువ ఆర్థిక పరిపుష్టిత కలిగిన జిల్లాగా పేరు గడించినప్పటికీ స్థిరమైన జిడిపి సాధించలేక పోతున్నామన్నారు. పారిశ్రామిక, సేవ రంగాల్లో అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని సాధ్యమైనంత వరకు నూతన పారిశ్రామికవేత్తలు సంబంధిత భూ యజమానుల భాగస్వామ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 28వ తేదీ నుండి నేటి వరకు వివిధ శాఖల అనుమతుల కోసం 1,576 ధరఖాస్తులు రాగా 1,503 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, మరో 73 ధరఖాస్తులు పరిష్కరించవలసి ఉందన్నారు. పిఎంఈజీపి పథకం 2025-26 కింద యూనిట్ల స్థాపన మంజూరు కొరకు 141 దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగిందని, 191 యూనిట్లు స్థాపించడం జరిగిందని, బ్యాంకుల వద్ద పెండింగ్ లో 111 దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ర్యాంపు పథకంలో భాగంగా జిల్లాలో సెప్టెంబర్ మాసంలో 12 ఉద్యమ్ వర్క్ షాపులు నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, జిల్లా టూరిజం శాఖ అధికారి ఏ.వి అప్పారావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఎం.రామ్ నాథ్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్వాతి, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఈ జి.వెంకటరమణ, ఫిషరీస్ ఏడి ఎల్.ఎన్ రాజు, ఎలక్ట్రికల్ ఈఈ వెంకటేశ్వరరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అరుణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.