Close

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి

Publish Date : 04/06/2026

ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరో్యకర ఓటర్ల జాబితా కీలకం

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తప్పక నమోదు చేయించాలి

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి

పారదర్శకంగా, సమర్థవంతంగా సర్వే నిర్వహణకు రాజకీయ పార్టీల సహకారం అవసరం

…. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

జిల్లా కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా అత్యంత ముఖ్యమని తెలిపారు. జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం మరియు అనర్హులైన పేర్లు తొలగించబడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
బూత్ లెవల్ అధికారులు (BLOలు) తమ విధులను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, 2002 ఓటర్ల జాబితా మరియు 2025 తాజా జాబితాలను ఆధారంగా తీసుకుని మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో కనీసం 95 శాతం సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8 తదితర దరఖాస్తు పత్రాలను బిఎల్వోలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా వెయ్యి మంది ఓటర్లకు మాత్రమే పరిమితం ఉండేలా నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ చేపట్టాలని తెలిపారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా చురుకుగా పాల్గొనాలని కోరారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ను వివరిస్తూ, జూన్ 5 నుండి 14 వరకు శిక్షణ మరియు ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుండి జూలై 14 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని చెప్పారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓటరు నమోదుకు సంబంధించి అవసరమైన పత్రాలపై కూడా కలెక్టర్ వివరణ ఇచ్చారు. 01.07.1987కు ముందు జన్మించినవారు, 01.07.1987 నుండి 02.12.2004 మధ్య జన్మించినవారు, అలాగే 02.12.2004 తర్వాత జన్మించినవారికి వేర్వేరు ధృవపత్రాలు అవసరమవుతాయని తెలిపారు. జనన ధృవపత్రం, విద్యా ధృవపత్రాలు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు తదితర పత్రాలను వినియోగించవచ్చన్నారు.
ఇంటింటి సర్వే ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించినవారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను సేకరించి జాబితా శుద్ధి చేపడతామని తెలిపారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువత, మహిళలు, దివ్యాంగులు, వలస కార్మికులు వంటి వర్గాల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ డాక్టర్ కె.సి.హెచ్. అప్పారావు, డిపిఓ వై.దోసి రెడ్డి, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.