జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా వడగాల్పును తట్టుకునేందుకు ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీట్ ద్వారా స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ నెల 17న “బీట్ ద ఈట్” థీమ్ తో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వడగాల్పుల కారణంగా ఒక్క మరణం కూడా సంభవించకూడదన్నారు. ఇందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో ట్రాఫిక్ ప్రాంతాల్లో, మార్కెట్లు, టెంపుల్స్, బస్సు షెల్టర్స్, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా నీడనిచ్చే తెరలను ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలను తీసుకోవాలన్నారు. రూప్ టాప్ గార్డెన్స్ పెంచాలని, గృహములలో ఉండేవారు ఎండవేడికి తట్టుకునే విధంగా స్లాబులపై వైట్ పెయింట్ ను వేయించుకోవాలని సూచించారు. వర్షాకాలం సీజన్లో రోడ్ల పక్కన, స్కూళ్ల వద్ద మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. రోడ్లమీద సంచారించే పశువులు ఎండ తీవ్రత తట్టుకోలేక మంచినీటి కొరకు తహతలాడతాయని కాళీ ప్రదేశాలలో, రోడ్ల పక్కన కుండీలను ఏర్పాటు నీటితో నింపి ఉంచాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడగల్పులు బారిన పడకుండా చిన్నపిల్లలకు, వృద్ధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని అన్నారు. తుఫానులు వచ్చే సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై విపత్తు నిర్వహణ శాఖ వారు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు. పారిశుధ్యం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు కనిపిస్తే సంబంధిత అధికారులుపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యముగా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు డోర్ టు డోర్ చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుద్ధ్యంలో ప్రత్యేక శ్రద్ధ చూపించినవారికి, సేవా కార్యక్రమాలు చేసే ఎన్జీవోలకు, డ్వాక్రా గ్రూపులకు, శానిటేషన్ సిబ్బందికి అవార్డులను ఇచ్చి ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
గూగుల్ మీట్ లో జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై. దోసిరెడ్డి, సిపిఓ కె.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతిరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.రామాంజనేయ రాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి గణపతి రావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్ప రాణి, తదితరులు పాల్గొన్నారు.