జిల్లాలో ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతంలో ఆక్వా సాగు చేస్తున్న రైతులు అందరూ తప్పనిసరిగా సిఐఐఏ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

గురువారం భీమవరం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగు రైతులతో, మత్స్యశాఖ అధికారులతో సమావేశమై సిఐఐఏ రిజిస్ట్రేషన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దేశంలోనే పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేసి బ్రాకిష్ వాటర్ క్లస్టర్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. దీనివలన కేంద్ర ప్రభుత్వం సిఐఐఎ కింద మంజూరు చేసే ప్రయోజనాలను పొందడానికి వీలవుతుందని తెలిపారు. జిల్లాలో 17,100 ఎకరాలు బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగులో ఉందని, బ్రాకిష్ వాటర్ ఆక్వా రైతులందరూ తప్పనిసరిగా సిఐఐఎ రిజిస్ట్రేషన్ లను అక్టోబర్ నెలాఖరులోపుగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో బ్రాకిష్ వాటర్ సాగులో మొగల్తూరు మండలంలో ఐదు రెవిన్యూ గ్రామాలు, నరసాపురం మండలంలో ఆరు రెవెన్యూ గ్రామాలు, యలమంచిలి మండలంలో, భీమవరం మండలంలో రెండేసి చొప్పున రెవిన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరం, ఉప్పునీటి సాగు కాలువలకు రెండు వందల మీటర్ల దూరంలో సాగు చేసేవి మాత్రమే బ్రాకిష్ వాటర్ సాగు పరిధిలోకి వస్తాయన్నారు. రైతుల సౌలభ్యం కొరకు రిజిస్ట్రేషన్ లను త్వరితగతిన పూర్తి చేయడానికి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ద్వారా యువతను ఎంపిక చేసి ఒకరోజు శిక్షణను ఇచ్చి సిఐఐఏ రిజిస్ట్రేషన్ లను పూర్తి చేయడానికి ఆలోచన చేసినట్లు తెలిపారు. రైతులందరూ సంబంధిత డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక నెల రోజులు లోపుగా ఫ్రెష్ వాటర్ లో ఆక్వా సాగు చేస్తున్న రైతులు అప్సదా రిజిస్ట్రేషన్ లను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందని, గడువు కూడా నేటితో ముగిసింది అన్నారు. మరొ 15 రోజులు గడువు పెంపకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ లోపుగా నూరు శాతం అప్సడా క్రింద రిజిస్ట్రేషన్ లను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఎల్పీఎంలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఫ్రెష్ వాటర్ కింద 1,32,503.91 ఎకరాలలో ఆక్వా సాగు విస్తీర్ణం ఉందని, ఇప్పటివరకు 56,881.8 ఎకరాల విస్తీర్ణంలోని రైతులు అప్సడా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం జరిగిందని, మిగిలిన వారు త్వరగా తన పూర్తి చేసుకుంటేనే ప్రభుత్వ రాయితీలను పొందగలరని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ అయ్యా నాగరాజా, ఏడిలు ప్రసాద్, ఎల్ ఎల్ ఎన్ రాజు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్, యంగ్ ప్రొఫెషనల్ క్రిష్ణ రెడ్డి, బ్రాకిష్ వాటర్ సాగు ఆక్వా రైతులు, వి ఎఫ్ ఏ లు, తదితరులు పాల్గొన్నారు.