జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు
మంగళవారం భీమవరం కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కు మత్స్య శాఖ అధికారులు వివరిస్తూ ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో 1,32,562.72 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుచున్నదని, వీటిలో 1,04,792.5 ఎకరాలు మాత్రమే ఆక్వా జోన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన వాటిలో 27,770 ఎకరాలలో ఆక్వా జోన్ సర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వర్షం ముంపు, తక్కువ సారం కలిగిన వ్యవసాయ భూములు, ఆక్వా చెరువులు చుట్టూ వున్న భూములు ఆక్వా సాగు అనుకూలంగా మరో 6,540 ఏకరాలను సర్వేలో గుర్తించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యశాఖ అధికారులు నిబంధనలు మేరకే ఆక్వా జోన్ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్వా జోన్ సర్వేలో అర్హత గల చెరువులను, పంటకు అనుకూలంగా లేని ముంపు ప్రాంతాలను మాత్రమే కొత్తగా చెరువులు తవ్వుకునేందుకు ఆక్వా జోన్ లో చేర్చాలన్నారు. గ్రామ సభలో తీర్మానం చేసిన తరువాత జిల్లా స్థాయి కమిటీలకు నివేదిక సమర్పించాలని అన్నారు. మండల స్థాయి కమిటీలు అందజేసిన నివేదికలను ఆక్వా జోన్ నిబంధనలు మేరకు ఉన్నవో, లేదో ఆక్వా కల్చర్ జిల్లా స్థాయి కమిటీ అధికారులు కూడా పరిశీలించి తనిఖీ చెయ్యాలని ఆదేశించారు. అలాగే ఆక్వా సాగు రైతులు ప్రభుత్వ నిబంధనల మేరకే సాగు చేయాలని తెలిపారు. జిల్లాలో 1,32,563 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 50,449 ఎకరాలు మాత్రమే అప్సదా నందు లైసెన్స్ పొంది ఉన్నారని తెలిపారు. మిగిలిన సుమారు 80 వేల ఎకరాల విస్తీర్ణంలోని చెరువులను కూడా ఒక నెల లోపుగా సమీప సచివాలయంలో గల విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ద్వారా ematsyakar website నందు నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. రైతులు అప్సద నందు నమోదు ప్రకియను పూర్తి చేసుకోవాలని, లేని ఎడల ప్రభుత్వ పథకాలు రావని, అలాగే విద్యుత్ సబ్సిడీ కూడా వర్తించదని స్పష్టం చేశారు. కావున లైసెన్స్ లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకొని లైసెన్స్ పొందాలని తెలిపారు.
ఈ సమావేశంలో గణపవరం, నరసాపురం, భీమవరం – 1, 2 మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆర్ వి ఎస్ ప్రసాద్, ఎల్ ఎల్ ఎన్ రాజు, సిహెచ్ రాంబాబు, ఎన్ వెంకటేశ్వరరావు, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.