జిల్లాలో అర్హత కలిగిన 8,489 మంది లబ్ధిదారులకు అక్టోబర్ 4న “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అక్టోబర్ 4న “ఆటో డ్రైవర్ల సేవలో” పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించనున్నారని, దీనికి అనుగుణంగా నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు నమూనా చెక్కులను అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అర్హత గల 8,489 మంది ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నదన్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి రేపు ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ ఉన్నందున జిల్లాలో నిర్వహించే సమావేశాల వద్ద డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు జిల్లాలోని మంత్రులు, ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్ట ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గూగుల్ మీట్లో నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, రవాణాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.