Close

జిల్లాలోని వివిధ కంపెనీలకు అవసరమైన సిబ్బంది కొరతను తీర్చేందుకు వివిధ కోర్సులు పూర్తిచేసుకున్న యువతను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 29/03/2025

శనివారం స్థానిక హోటల్ ఆనంద ఇన్ మీటింగ్ హాల్ నందు జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఇండస్ట్రీ మీట్” కు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో పలు దఫాలుగా “ఉద్యోగ దిక్సూచి” పేరిట ఉద్యోగాల కల్పనకు మేళాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మేళాలో నిర్వహించినప్పుడు నిరుద్యోగ యువత హాజరవుతున్నారని, ఎంపిక కాబడి నియామకం లేక అందుకున్న తర్వాత జాయిన్ కావడం లేదని గ్రహించడం జరిగిందన్నారు. ఏదైనా ఒక కంపెనీలో తొలుత జాయిన్ అయ్యి అనుభవం గడించిన తర్వాత మంచి అవకాశాలు అవే వస్తాయని, జీవితంలో స్థిరపడడానికి తోడ్పడుతుందని గ్రహించాలన్నారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమలు, కంపెనీలలో పనిచేయుటకు సిబ్బంది కొరత పెద్ద ఎత్తున ఉందని, ఈ విషయాన్ని సంబంధిత యాజమాన్యాలు కూడా తన దృష్టికి తీసుకువచ్చాయన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి 15 నుండి 20వేలకు ఉద్యోగం చేయడం కన్నా, స్థానికంగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన కుటుంబానికి దగ్గరగా ఉండే ఆర్థికంగా నెల తొక్కుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెమ్మదిగా ఉన్నతంగా ఎదగడానికి యువత కృషి చేయాలని పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీల యాజమాన్యాలు వారికి అవసరమైన సిబ్బంది రిక్వైర్మెంట్ను జాబితాను నైపుణ్యాభివృద్ధి అధికారికి అందజేయాలని సూచించారు. యువతకు మోటివేషన్ తరగతులను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ఉన్న కంపెనీలు, పరిశ్రమలు ఇంటర్న షిప్ ను ఏర్పాటు చేస్తే మీకు కూడా అవసరమైన సిబ్బందిని ఎంపిక చేసుకోవడానికి వీలవుతుందని సూచించారు.

ఇండస్ట్రీ మీట్ లో పలు సంస్థల హెచ్ఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో ఒక పోస్టు ఉంటే పది దరఖాస్తులను అందుకునే వారమని, ఇప్పుడు దరఖాస్తుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకున్న కూడా చేరడం లేదని తెలిపారు. ఆంగ్ల భాషలో పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం లేక కొంతమంది యువత ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న కూడా చేరే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నట్లు పలువురు సమావేశంలో స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కంపెనీలలో ఉద్యోగస్తుల కొరతపై ప్రత్యేక దృష్టి సారించడానికే నేడు ఇండస్ట్రీ మీట్ ద్వారా మీ అందరితో సమావేశం కావడం ప్రధాన ఉద్దేశం అన్నారు. త్వరలో యువతతో, పరిశ్రమల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు.

చివరిగా వివిధ కంపెనీలకు నియామకం కాబడిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఏ. నాగేంద్ర ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఏ.లక్ష్మి, గవర్నమెంట్ ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు, ఏపీ ఎస్ ఎస్ డి ఓ ఆంజనేయులు, ప్లాంట్ ఆఫీసర్ రమేష్, డిస్టిక్ హెచ్ఆర్ వీరభద్రం, ఎంప్లాయిమెంట్ వైపి ఎం.ఎల్ కృష్ణారెడ్డి, జిల్లాలోని వివిధ పరిశ్రమలు, కంపెనీల హెచ్ఆర్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.