జిల్లాలోని వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించడం జరుగుచున్నదని, విద్యార్థులు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

గురువారం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి బిసి బాలికల వసతి గృహం, ఎస్.బి.ఎం జిల్లా పరిషత్ హై స్కూల్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తనిఖీ చేసి వసతి గృహం నందు చేపట్టి పూర్తిచేసిన పనులను పరిశీలించారు. ఇంకా పెండింగ్ పనులు ఉంటే చేయించాలని నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నందు ఫ్లోరింగ్ పనులను, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పనులను, పైప్ లైన్ ల లీకేజ్ పనులను పూర్తి చేయడం జరిగిందని హౌసింగ్ పీడీ జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం వసతి గృహం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో అన్ని పనులను పూర్తి చేసామని, బాగా చదువుకోని విద్యలో రాణించాలని సూచించారు. అనంతరం వసతి గృహాన్ని ఆనుకుని ఉన్న ఎస్ బి ఎం జడ్పీ హై స్కూల్ ను పరిశీలించి, తొమ్మిదవ తరగతి విద్యార్థులతో కొద్ది సమయం ముచ్చటించారు. విద్యార్థి దశలోనే బాధ్యతలు ఉండవని మీ బాధ్యతలను మీ తల్లిదండ్రులు మోస్తూ మిమ్మల్ని ఉన్నత విద్యావంతులను చేసే లక్ష్యంతో కష్టపడడం జరుగుచున్నదని, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు మీకు దూరంగా విదేశాలకు కూడా వలస వెళ్లి మీకు నగదును పంపించడం జరుగుతుందని, ఈ విషయాన్ని గుర్తుంచుకుని వారి కలలను సాకారం చేసే బాధ్యత మీ అందరి పైన ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఎనిమిదో తరగతి నుండి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పదో తరగతి చదివే నాటికి మెరుగైన రీతిలో ఉంటారన్నారు. చదువుతోపాటు కెరియర్ ను ఎలా మలుచుకోవాలి, పదవ తరగతి తర్వాత ఏ కోర్సులు చదివితే ఏ ఏ అవకాశాలు ఉంటాయి తదితర విషయాలను తరచూ పిల్లలకు తెలియజేయాలన్నారు. మీ ద్వారా తెలియజేస్తేనే విద్యార్థులకు చక్కగా బోధపడుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ను కలిసిన స్కూల్ కమిటీ సభ్యులు విద్యార్థులు ఆడుకొనుటకు ఆట స్థలం ఇబ్బందిగా ఉందని, స్కూలుకు ఉన్న మూడు ఎకరాల స్థలంలో కొంత ఆక్రమణకు గురై ఉన్నదని, మిగతా స్థలాన్ని ఆట స్థలానికి అవకాశం కల్పించాలని విన్నవించడం జరిగింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్థలం, ఖాళీ స్థలం తదితర వివరాలను అందజేయాలని తహాసిల్దార్ ను ఆదేశించారు.
ఈ సందర్భంలో నరసాపురం ఆర్టీవో దాసిరాజు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, మొగల్తూరు తహాసిల్దార్ కే.రాజ్ కిషోర్, ఎంపీడీవో సిహెచ్.త్రిశూలపాణి, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి జి.గణపతిరావు, హెచ్ డబ్ల్యు ఓ సిహెచ్ రామ కళ్యాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామరాజు, సర్పంచ్ అడ్డాల సూరిబాబు, ఎంపీటీసీ తిరుమణి స్వామి, తదితరులు ఉన్నారు.