జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల మూడో శనివారం నాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం భీమవరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో మావుళ్ళమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటుచేసిన సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గత 6 నెలలుగా పశ్చిమగోదావరి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులు వల్ల కలిగే హాని గురించి, ప్రజలకు ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం కావాలన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, నీటి బాటిల్ కవర్లు వాడకం చాలా ప్రమాదకరమని వాటిని వినియోగించటం వలన రోగాలను మనమే కొని తెచ్చుకోవటం జరుగుతుందని అన్నారు. వీటి నియంత్రణ చేయుటకు మొదటగా భీమవరం పట్టణం నుండి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ప్లాస్టిక్ బదులుగా గుడ్డ సంచులను పేపర్ కవర్లను వాడాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధంలో భాగస్వాములు కావాలని అన్నారు. బయో ప్రొడక్ట్స్ తో తయారు చేసిన వస్తువులు వినియోగించడం వలన రోగాల బారిన పడకుండా ఉండవచ్చును అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ అధికారులు సచివాలయాల సిబ్బంది ప్రతిరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగించిన విక్రయించిన జరిమానాలు విధించాలన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం భీమవరం మావుళ్ళమ్మ గుడి సమీపంలో కొన్ని షాపులు, పండ్ల దుకాణాలను జాయింట్ కలెక్టర్ సందర్శించి షాపుల యజమానులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలు గురించి వివరించారు. పట్టణంలో బస్టాండు, కేశవరావు హై స్కూల్ ప్రాంతాల్లో పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయుటకు జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంలో జాయింట్ కలెక్టర్ వెంట ఆర్టీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఏ. రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ త్రినాధరావు, తాహసిల్దార్ రావి రాంబాబు, స్వచ్ఛంద సంస్థ కంతేటి వెంకటరాజు, మావుళ్ళమ్మ టెంపుల్ కార్య నిర్వహణ అధికారి, వర్తక సంఘాల సభ్యులు, షాపులో యజమానులు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.