జాబ్ కార్డు పొందిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నరసాపురం మండలం వేములదీవి ఈస్ట్ నందు ఉపాధి హామీ పనులను, లక్ష్మణేశ్వరం హౌసింగ్ కాలనీ ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు, తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్న సమయంలో ఉపాధి కూలీలను జిల్లా కలెక్టర్ పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులకు ఇబ్బంది ఏమైనా ఉందా, అవసరమైన వారికి పనులు కల్పిస్తున్నారా, డబ్బులు సకాలంలో జమ అవుతున్నాయా, ఉపాధి హామీ పనులు లేనప్పుడు వ్యవసాయ పనులకు వెళ్తారా అని ప్రశ్నించి సమాధానాలను తెలుసుకున్నారు. పనిలో నాణ్యత తప్పకుండా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ కార్డు పొంది, కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పించాలని డ్వామా అధికారులను ఆదేశించారు. వేములు దీవి ఈస్ట్ మురుగు బోదులు పూడికతీత పనులను ఉపాధి కూలీల ద్వారా 1500 మీటర్ల పరిధిలో చేపట్టడం జరిగిందని, ఈ పని నిమిత్తం అంచనా వ్యయం రూ.1.79 లక్షలుగా ఉందన్నారు. 80 మంది కూలీలు పనిచేస్తున్నారని 750 పనిదినాలను కల్పించడం జరిగిందన్నారు. ఫీడర్ చానల్స్, చెరువు పూడికలు, డిస్ట్రిబ్యూటరీ చానల్స్, తదితర పనులను ఉపాధి హామీ పనుల కింద అప్పగించాలని సూచించారు.
ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లక్ష్మణేశ్వరం హౌసింగ్ లే అవుట్ ను పరిశీలించిన సందర్భంలో వివిధ నిర్మాణ దశలలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి లబ్ధిదారులు ఎక్కడ ఉంటున్నారు, ఎందుకు నిర్మాణాలు పూర్తి కాలేదు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు అదనంగా 50 వేల రూపాయలను నిర్మాణాలకు అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. లక్ష్మణేశ్వరంలో 93 ప్లాట్లను కేటాయించి, 85 గృహాలను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 47 గృహాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. మూడు గృహాలు రూఫ్ కాస్ట్ లెవెల్ లోను, నాలుగు రూఫ్ లెవెల్ లోను, 12 లింటెల్ లెవెల్ లోను, 15 బిఎల్ లెవెల్ లోను ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంలో కాలనీలో ఇప్పటికే నివాసం ఉంటున్న కొందరు మహిళలు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ కాలనీకి రాకపోకలు సాగించే ఒక దారిని ఫెన్సింగ్ తో మూసివేయడం కారణంగా నడకదారికి ఇబ్బందిగా ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, తదితర సమస్యలు ఉన్నాయని నివాసితులు కలెక్టర్ కు విన్నవించడం జరిగింది.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు, డ్వామా పిడి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, ఇంచార్జ్ తహాసిల్దార్ ఐ వి వి సత్యనారాయణ, ఎంపీడీవో జీవీఎస్ కృష్ణంరాజు, సర్పంచ్ వెంకటేశ్వరరావు, డ్వామా ఏపీవో శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ ఈఈ ఎం.శ్రీనివాస్, డిఈ ఆర్.త్రిమూర్తులు, తదితరులు ఉన్నారు.