• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

జాతీయ ప‌తాకాన్ని ఆవిష్కరించిన‌ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు.

Publish Date : 15/08/2025

అంగరంగ వైభవంగా 79 వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు

ఆర్థిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి పిలుపు.

భీమవరం కలెక్టరేట్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో శుక్రవారం నిర్వ‌హించిన‌ 79వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు అంగరంగ వైభవంగా జ‌రిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి వంద‌న సమర్పణ చేశారు. ప‌రేడ్ క‌మాండర్ ఆధ్వ‌ర్యంలోని పోలీసు ద‌ళం మంత్రికి సెల్యూట్ స‌మ‌ర్పించగా, బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆల‌పించింది. ప‌రేడ్ కమాండ‌ర్ స్వాగ‌తం మేరకు ప్రత్యేక వాహనంలో ప‌రేడ్ మైదానాన్ని సందర్శించి పోలీసు ద‌ళాల నుంచి గౌర‌వ వందనాన్ని మంత్రి స్వీక‌రించారు. అనంత‌రం అతిథి స‌భా వేదిక వ‌ద్దకు చేరుకొని జిల్లాలో వివిధ శాఖలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన అమరవీరులను ముందుగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను పూలమాల, దుస్సాలువతో ఘనంగా సత్కరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, ఇటువంటి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారు, పోరాటాలు చేశారన్నారు. అలాంటి వారిలో మన తెలుగు బిడ్డ మన జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి ఉద్దరాజు రామరాజు, రుక్మిణి లక్ష్మీపతి, పసల అంజిలక్ష్మి ఇలాంటి ఎందరో త్యాగధనులతో కూడిన మన పశ్చిమగోదావరి జిల్లా స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారందరినీ గుర్తుకు చేసుకోవడం నా బాధ్యతగా భావిస్తూ స్వాతంత్రోద్యమ వీరులకు నమస్సుమాంజలి మరియు అధికారులకు నా నమస్కారాలు అందిస్తున్నానని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా అంటే మంచికి, మర్యాదలకు, ప్రశాంతతకు మారుపేరు అన్నారు. దాహం వేస్తుందని మంచినీళ్లు అడిగితే, చల్లని మజ్జిగ ఇచ్చి పంపించే మంచి సాంప్రదాయం ఉన్న జిల్లా మన పశ్చిమగోదావరి జిల్లా. 2014-19 నందు ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ స్టేషన్ లు కూడా అవసరం లేని జిల్లా అని కొనియాడారు. ఇటువంటి జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కొత్తగా ఈ జిల్లా ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినదని, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ కార్యాలయముల నిర్మాణం వంటి అనేక పనులు చేయవలసిన అవసరం ఉందన్నారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా మార్గదర్శి- బంగారు కుటుంబం నినాదంతో పి 4 కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామన్నారు. సంపన్న కుటుంబాలు అట్టడుగు ఉన్న పేద వర్గాలకు చేయూతనివ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 2021 మంది మార్గదర్శిలు రిజిస్టర్ చేసుకొని 49,951 బంగారు కుటుంబాలలో 37,128 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు

పోలీసు ర‌క్ష‌క ద‌ళాలు, ఎన్సిసి క్యాడెట్లు, స్కౌట్ విద్యార్థులు చేసిన విన్యాసాలు, మార్చ్ ఫాస్టు, గౌర‌వ వంద‌న త‌దిత‌ర అధికారిక ప్ర‌క్రియ‌ల‌ నడుమ స్వాతంత్ర్య వేడుక‌లు ఆద్యంతం ఉత్సాహభ‌రితంగా సాగాయి. ఈ సందర్భంగా వివిధ పాఠ‌శాల‌ల విద్యార్థులు చేసిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆహుతుల‌ను ఆధ్యంతం అల‌రించాయి. ఈ వేడుకలలో స్వాతంత్య్ర స‌మ‌ర‌ యోధులు, ప్రజా ప్రతినిధులు, న్యాయ వ్య‌వ‌స్థ ప్ర‌ముఖులు, పోలీసు అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధులు, సామాజిక సేవా కార్య‌క‌ర్త‌లు, వివిధ వ‌ర్గాల ప్ర‌జలు, అధికారులు, పాత్రికేయులు, విద్యార్థులు ఈ వేడుకలలో ఉత్సాహంగా భాగ‌స్వామ్య‌మ‌య్యారు.

ప్రశంసా పత్రాలను ప్ర‌ధానం చేసిన మంత్రి

రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు జిల్లాలో వివిధ శాఖ‌ల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వచ్చంద సంస్థలకు, సాంస్కృతిక బృందాలకు మంత్రి అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ అడిషనల్ ఎస్పీ యు.భీమారావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.