Close

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Publish Date : 17/02/2026

జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత తీసుకుంటుంది అన్నారు. విద్యార్థులతో మమేకమై వారికి చదువులు గురించి అడిగి తెలుసుకున్నారు. శుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం, పరిశుభ్రమైన నీరు తాగడం అలవర్చుకోవాలని సూచించారు. మాత్రలు తీసుకునే విధానం వాటి ప్రయోజనాలు గురించి వివరించారు. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య సాధారణంగా కనిపిస్తుందని ఇది రక్తహీనత పోషకాహార లోపం చదువులో ఏకాగ్రత తగ్గటం వంటి సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. అందువల్ల ఒకటి నుండి 19 సంవత్సరాలు వయసు గల పిల్లలందరూ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు పాఠశాలకు వెళ్ళని పిల్లలు కూడా అంగన్వాడి కేంద్రాల ద్వారా ఈ మాత్రలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా బలంగా ఉంటేనే చదువులో రాణించగలరని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండటం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నులి పురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత అలసట చదువుపై దృష్టి లోపం వంటి సమస్యలు వస్తాయని అందుకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం నులి పురుగు నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ మాత్రలు వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి (డీ-వార్మింగ్) మాత్రలను స్వయంగా విద్యార్థులకు వేసి కార్యక్రమము ప్రారంభించారు. ఒకటి నుండి 19 సంవత్సరాలు పిల్లలందరూ మాత్రమే తప్పనిసరి వేసుకోవాలి, ఈరోజు రాని వారికి 24వ తేదీన వెయ్యాలి అన్నారు.

అనంతరం టెన్త్ క్లాస్ విద్యార్థుల క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే కీలకమైన పదవ తరగతి పరీక్షలను లక్ష్యంగా పెట్టుకుని 100 రోజుల పాటు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. విద్యార్థులు ప్రతి రోజూ కనీసం నిర్దిష్ట సమయాన్ని పాఠ్యాంశాల పునశ్చరణకు కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ప్రతి వారం మాక్ టెస్టులు రాసి, తమ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. టైమ్ టేబుల్ తయారు చేసుకుని దానిని కచ్చితంగా పాటించడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. అలాగే మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా సరైన నిద్ర, సమతుల్య ఆహారం తీసుకోవాలని చెప్పారు. సందేహాల నివృత్తి కోసం ఉపాధ్యాయులను సంప్రదించడంలో సంకోచించవద్దని ప్రోత్సహించారు. 100 రోజులు మీ జీవితాన్ని మార్చే రోజులుగా మీరు కష్టపడితే ఫలితం తప్పక వస్తుంది అన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మెరుగైన ఫలితాలు సాధించి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, జిల్లా వైద్య శాఖ అధికారి జి.గీతాబాయి, మండల విద్యాశాఖ అధికారి పి.వి.ఎస్. నాగరాజు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు జై.సాయి ప్రసాద్, ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.