Close

జనాభా లెక్కల సేకరణ-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో వెల్లడి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 20/02/2026

తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ డిజిటల్ విధానంలో ….

అందుకు అనుగుణంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్, వెబ్ పోర్టల్ …

ఖచ్చితమైన వివరాలతో కూడిన జనాభా లెక్కల సేకరణకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేస్తాం…

జనాభా లెక్కల సేకరణ-2027పై ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు అయిన జిల్లా కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశం శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.

ప్రత్యేక బాధ్యతగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు.
జనాభా లెక్కల సేకరణ విషయంలో జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులైన జిల్లా కలక్టర్లు కీలకపాత్ర పోషించాలని డిప్యూటీ రిజిష్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డా.వివిఎల్ఎన్ శర్మ కోరారు. ఈ సమావేశంలో జనాభా లెక్కల సేకరణ-2027 కు సంబంధించిన సన్నద్ధత అంశాలు, మాస్టర్ ట్రైనర్స్, ఫీల్డు ట్రైనర్ల ఖరారు, జిల్లా సెన్సస్ అధికారులు, చార్జి అధికారులకు శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈసమావేశంలో రిజిష్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయ డిప్యూటీ రిజిష్ట్రార్ జనరల్ డా.వివిఎల్ఎన్ శర్మ మాట్లాడుతూ 2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 16వది కాగా స్వాతంత్ర్యం వచ్చాక 8వది మరియు ప్రపంచంలోనే పురాతన మైన జనాభా లెక్కల సేకరణ అని పేర్కొన్నారు. రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్(హెచ్ఎల్ఓ), రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (పిఇ) జరుగుతుందని తెలిపారు. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో డిజిటల్ అక్షరాస్యత చాలా బాగుందని, కావున ఖచ్చితంగా ఉత్తమ డేటాను సేకరించడానికి వీలు కలుగుతుందని డా.శర్మ పేర్కొన్నారు. జనాభా గణన డేటా ప్రణాళిక, విధాన అభివృద్ధి మరియు సమాజ అవసరాలను అర్థం చేసుకోవడానికి కీలక మైనదిగా ఆయన చెప్పారు. అంతేగాక ఖచ్చితమైన ప్రణాళిక మరియు వనరుల కేటాయింపు కోసం ప్రక్రియ చాలా ముఖ్యమైనదని చెప్పారు. జనాభా గణన విజయవంతం అనేది అంకిత భావంతో పాల్గొనడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నారు. అంతేగాక డేటా సేకరణ కోసం నియమించబడే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు సమర్థవంతమైన శిక్షణపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ విజయవంతం అనేది సేకరించే డేటాను బట్టి ఉంటుందని చెప్పారు. జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఇప్పటికే రిజిష్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని డా.శర్మతెలిపారు.

సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమావేశం వివరాలను వెల్లడిస్తూ 2027 జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని, డిజిటల్ రూపంలో జనాభా లెక్కల సేకరణతో పాటు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు సహితం వ్యక్తిగతంగా సెల్ప్ ఎన్యుమరేట్ చేసుకునేందుకు వీలుందని తెలిపారు. అందుకు అనుగుణంగా మొబైల్ అప్లికేషన్, వెబ్ పోర్టల్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు. జనాభా లెక్కల సేకరణ విషయంలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు ఆయన జిల్లా కలెక్టర్ కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, వివిధ శాఖల సమన్వయంతో ఖచ్చితమైన వివరాలతో కూడిన జనాభా లెక్కల సేకరణకు అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాలకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని వివరించారు.

2.1111