Close

జనాభా గణన–2027లో భాగంగా గృహ గణన నమోదు రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశం

Publish Date : 03/06/2026

జిల్లాలో కొనసాగుతున్న జనాభా గణన–2027 లో భాగంగా గృహ గణన నమోదు ప్రక్రియను వచ్చే రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఒక్క గృహం కూడా నమోదుకు మిగలకుండా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సూచించారు. బుధవారం గృహ గణన నమోదులో తక్కువ ప్రగతి ఉన్న మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, యుఎస్ఎఫ్ సర్వే గణాంకాలకు అనుగుణంగా ప్రస్తుత గృహ గణన గణాంకాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా నమోదు తక్కువగా ఉన్నట్లయితే, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంట్లో లేని కుటుంబ సభ్యుల వివరాలను పొరుగువారి సమాచారం ఆధారంగా నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు, నిర్మాణ ప్రదేశాలు, వలస కార్మికులు నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ప్రతి కుటుంబం గృహ గణనలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. జనాభా గణన దేశ భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల ప్రణాళికలకు అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ఖచ్చితమైన గణాంకాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు పునాదిగా నిలుస్తాయని చెప్పారు. అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి వంద శాతం నమోదు లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.