Close

జనవరి 2 నుండి 9 తేదీ వరకు 110 గ్రామాలలో రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ–జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 31/12/2025

పండుగ వాతావరణంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి.

కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ అంశాలపై బుధవారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీవోలు తహసీల్దారులు గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 2 నుండి 9వ తేదీ వరకు రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. జిల్లాకు 75,804 పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయని, వీటిని 110 గ్రామాలలో పంపిణీ చేసేందుకు తహసిల్దార్లు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముందుగా పట్టాదార్ పాస్ పుస్తకాలలో ముద్రించిన పేరు, ఫోటో, నెంబరు తదితరు వివరాలు సక్రమంగా ఉన్నది, లేనిది క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నవి మాత్రమే రైతులకు పంపిణీ చేయాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకంపై వివరాలు తప్పుగా ముద్రితమైతే వాటిని పంపిణీ చేయొద్దు అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ షెడ్యూల్ తహసిల్దార్లు ముందుగా ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతితులను సాదరంగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన తదుపరి వారి నుండి రైతుల నుండి పాత పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోవాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై తహాసిల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గత సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రధమ రెవెన్యూ క్లినిక్ కు వచ్చిన అర్జీలను ఏ విధంగా శాశ్వత పరిష్కారం చేయాలో రెవెన్యూ అధికారులతో చర్చించారు. రెవెన్యూ అంశాలపై వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ రెవెన్యూ క్లినిక్ ల నిర్వహణ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఏయే మండలాలలో ఎక్కువగా రెవెన్యూ అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయో ఆయా రెవిన్యూ డివిజన్ కార్యాలయాలలో రెవెన్యూ క్లినిక్ లు ఏర్పాటుచేసే ఆలోచన చేస్తున్నామన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం సమన్వయంగా పనిచేస్తే ఈ క్లినిక్ ల ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ గూగుల్ మీట్లో జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు తహసిల్దార్లు, కలెక్టరేట్ డిటి సన్యాసిరావు, సిబ్బంది ఉన్నారు.