జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 20/10/2026
WhatsApp Image 2026-10-20 at 5.20.23 PM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కుల సంబంధిత సున్నితమైన అంశాలు తదితర విషయాల్లో ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత నోడల్ అధికారులను సంప్రదించి స్పష్టత పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రిటర్నింగ్ అధికారుల హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా పరిశీలించి ఎన్నికల నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. సందేహాలు నివృత్తి కాకపోతే కంట్రోల్ రూమ్ లేదా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని సంప్రదించాలని సూచించారు.

ఎన్నికలకు సంబంధించిన ఫారాలు, నివేదికలు, ఇతర రికార్డుల తయారీని చివరి నిమిషం వరకు వాయిదా వేయకూడదని జిల్లా కలెక్టర్ సూచించారు. నామినేషన్లకు సంబంధించిన ఫారం-ఎ, ఫారం-బి తదితర పత్రాల విషయంలో నిర్దేశిత నిబంధనలను పాటిస్తూ, సంబంధిత అధికారుల మధ్య సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులతో పాటు వాటికి సంబంధించిన నివేదికలను కూడా నిర్ణీత గడువులోగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల్లో సమర్పించాలని స్పష్టం చేశారు.

ఎన్నికల నిర్వహణలో సున్నితమైన అంశాలను ముందుగానే గుర్తించి, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు.

ఎన్నికల నిర్వహణ అధికారులకు అప్పగించిన కీలకమైన బాధ్యత అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పరిధిలోని విధులను నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో అధికారుల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్ల పురోగతిని నిరంతరం సమీక్షించుకోవాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, రికార్డులు, ఇతర మౌలిక ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఎన్నికల ప్రక్రియలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో డి. రమణ, డీపీఓ దోసిరెడ్డి, ఆర్డీవోలు, రిటర్నింగ్ అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.