చేనేత వస్త్ర అమ్మకాలకు ప్రోత్సాహకాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకుగాను జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ తో కలిసి చేనేత కాటన్ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత చీరలను మగ్గాలపై నేసి తయారుచేసిన వస్త్రాలను వివిధ ప్రదేశాలలో అమ్మకాలకు ప్రదర్శించడం వలన వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు.
భారతదేశంలో వస్త్ర కళలలో చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు వున్నదని, అటువంటి రంగాన్ని మనమందరం ఆదుకొని మరింత గుర్తింపు తీసుకురావాలని అన్నారు. మారుతున్న కాలానుగుణంగా విదేశీ వస్త్రాలతో పాటు నేత చీరలు, పట్టు వస్త్రాలు వంటి చేనేత వృత్తి వారు తమ స్వహస్తాలతో వేసిన సహజసిద్ధమైన డిజైన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని అన్నారు. కాటన్ వస్త్రాలను ధరించడం వలన శరీరానికి ఎంతో హాయిగా ఉంటుందని అన్నారు.
చేనేత రంగంలో ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రాముఖ్యత మన భారతదేశానికి ఉందని అన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి, నేత కార్మికుల ఆర్థిక పురోగతికి భారతీయులమైన మనమందరం తప్పక ప్రోత్సహించాలని అన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు, సబ్సిడీలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్థానిక చేనేత వస్త్రాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. సహకార సంఘాల ద్వారా తయారుచేసిన చేనేత వస్త్రాలను ఈ వస్త్ర ప్రదర్శనలో ఆచంట మండలం వేమవరం, పెంటపాడు మండలం రామచంద్రాపురం, ఇరగవరం మండలం కే ఐ పర్రు, పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామాలకు చెందిన వారు వస్త్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ వస్త్ర ప్రదర్శనలో పలువురు జిల్లా అధికారులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తమ మద్దతును ప్రకటించారు.
కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఏ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ, డ్వామా పిడి డాక్టర్ కె సిహెచ్ అప్పారావు, తదితరులు ఉన్నారు.