చిరు వ్యాపారులు సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తెలిపారు
బుధవారం పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామ సమైక్య భవనం నందు డిఆర్డిఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిరు వ్యాపారులకు “సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్” కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ మహిళల కోసం మహిళలు రుణాలు మంజూరు చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక మన్నారు. చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా తక్కువ వడ్డీకే ఎస్ హెచ్ సి మహిళలు రుణాలను సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతట తీసుకెళ్లే విధంగా విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చిరు వ్యాపారులు అధిక వడ్డీలు చెల్లించి నగదును పొందుతున్నారని, దీనివలన వారికి వచ్చే లాభం మిగలడం లేదన్నారు. దీనిపై ఆలోచన చేసిన జిల్లా యంత్రాంగం సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ స్కీం లో చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు 20 వాయిదాలలో చెల్లించే విధంగా తక్కువ వడ్డీతో అందించడం జరుగుతుందన్నారు. ఈ మొత్తాన్ని వ్యాపారం కోసం వినియోగించుకోవాలని, సెల్ ఫోన్లు తదితర వస్తువులను కొనుగోలుకు వినియోగించరాదని సూచించారు.
చిరు వ్యాపారాలు చేసే 100 మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.10 లక్షల రుణాలను ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉపసభాపతి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, ఏపీఎంలు, విఓఎలు, ఎస్ హెచ్ జి మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


