Close

చదువే అభివృద్ధికి మూలం అని గ్రహించి, విద్యకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించిన మూర్తి రాజు దాతృత్వం అనుసరణీయంఅని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 12/11/2025

బుధవారం విద్యాదాత, గాంధేయవాది చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ (మూర్తి రాజు) 13వ వర్ధంతి సందర్భంగా జువ్వలపాలెం రోడ్ లోని ఆయన విగ్రహం వద్ద సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మూర్తి రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 110 సంవత్సరాల క్రితమే విద్య ఎంత అవసరమో, మరి ముఖ్యంగా ఆడపిల్లలకు ఎంత అవసరమో గుర్తించి వందలాది విద్యాసంస్థలను నెలకొల్పిన మహనీయుడు, విద్యాదాత, గాంధీయవాది మూర్తి రాజు మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వినోదబావే భూదానోద్యము పిలుపుకు తృణప్రాయంగా వందలాది ఎకరాల భూమిని అందజేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఇటువంటి దాతృత్వం కలిగి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల వలనే నేడు ప్రతి ఒక్కరికి విద్య చేరువైందన్నారు. అలాగే వృద్ధాశ్రమలకు, కుష్టు వ్యాధి కాలనీలకు స్థలాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వీరు 68 ఉన్నత పాఠశాలలు, 10 జూనియర్, డిగ్రీ కళాశాలు, రెండు పీఈటి కళాశాలు, 5 ఓరియంటల్ పాఠశాలలను నెలకొల్పిన విద్యా ప్రదాత గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఎంతోమంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి తద్వారా ఉపాధిని కల్పించారన్నారు. సుమారు 30 సంవత్సరాలు శాసనసభ్యులుగాను, దేవాదాయ ధర్మాదాయ శాఖ, విద్యా శాఖలకు మంత్రివర్యులుగా వారి సేవలు అనన్యమన్నారు. వారు నిర్మించిన విద్యాసంస్థలలో ఒక్కదానికైనా వారి పేరును పెట్టుకోలేదని, జాతీయ నాయకుల పేర్లున ఆ విద్యాసంస్థలకు నామకరణం చేయడం ఎంతో నిరాడంబరత స్ఫూర్తిస్తుందన్నారు. మానవతా మూర్తిగా, గాంధీయవాదిగా, ధర్మ మార్గాన నడిచిన వ్యక్తులను ఎల్లప్పుడు స్మరించుకుంటూ వారి మార్గంలో కొంతైనా అనుసరించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మూర్తి రాజు వర్ధంతి సందర్భంగా సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాద రాజు, కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, మానవతా సంస్థ ప్రతినిధులు చింతలపాటి రామకృష్ణ రాజు, బుద్ధ రాజు వెంకటపతి రాజు, పెనుమత్స రామ్మోహన వర్మ, అల్లూరి సీతారామరాజు సేవా సమితి ప్రతినిధులు కలిదిండి గోపాలకృష్ణంరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం, మంతెన రామలింగరాజు ఫౌండేషన్ ప్రతినిధి చేకూరి ఝాన్సీ, కార్మూరి బాబు, కలిగొట్ల గోపాల శర్మ, ఎస్ ఎస్ ఎన్ రాజు, అల్లు శ్రీనివాస్, అల్లూరి సాయి దుర్గ రాజు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.