Close

ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి

Publish Date : 17/09/2025

నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సమాజంలో ఎల్లప్పుడూ విశేష గౌరవం ఉంటుందని, చేతి వృత్తులకు కేంద్ర ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.

బుధవారం ఆకువీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలలో పాల్గొన్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రపంచానికి సృష్టికర్త, శిల్పకళా నిపుణుడు, వాస్తుశాస్త్ర పితామహుడు గా గౌరవింపబడే విశ్వకర్మ మహర్షి స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం అని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శిల్పకళ, వృత్తి పరమైన నైపుణ్యాలకు విశ్వకర్మ ఆరాధన ఎంతో ప్రేరణనిస్తుందన్నారు. ఈ రోజు సమాజంలోని వృత్తి నిపుణులు, శిల్పులు, కార్మికులు అందరికీ గౌరవప్రదమైన స్థానం కలిగించే విశిష్ట దినంగా అభిలాషించారు. కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్లో చేతివృత్తులదారులకు రూ.13 వేల కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. 18 రకాల చేతివృత్తులను భారత ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పేరిట చేతి వృత్తిదారులకు శిక్షణను అందించి కిట్స్, రోజుకు 500 రూపాయలు చొప్పున స్టైఫండ్ ను కూడా అందజేయడం జరుగుచున్నదన్నారు.

శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం విశ్వ కర్మ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17న శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని, ఈ సందర్భంగా శిల్పకారులను, కళాకారులను గౌరవించుకోవాలన్నారు. విశ్వ బ్రాహ్మణులు తమ అత్యుత్తమ శిల్పకళా నైపుణ్యం తో కర్ర, ఇనుము, బంగారం వంటి వస్తువుల రూప కల్పనలో దశాబ్ధాలుగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారన్నారని, వీరి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుందని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు మౌలిక వసతులు అందజేయడం ద్వారా భరోసా కల్పిస్తోందన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రపంచానికి సృష్టికర్త, శిల్పకళా నిపుణుడు, వాస్తుశాస్త్ర పితామహుడు గా గౌరవింపబడే విశ్వకర్మ మహర్షి స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం అని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో కార్మికులు, శిల్పులు, వృత్తిదారుల పాత్ర అమోఘమని, వారి శ్రమ, కృషి, ప్రతిభతోనే సమాజం సుస్థిర అభివృద్ధి సాధిస్తోందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం, శిల్పకళ, వృత్తి పరమైన నైపుణ్యాలకు విశ్వకర్మ ఆరాధన ఎంతో ప్రేరణనిస్తుందన్నారు. ఈ రోజు సమాజంలోని వృత్తి నిపుణులు, శిల్పులు, కార్మికులు అందరికీ గౌరవప్రదమైన స్థానం కలిగించే విశిష్ట దినంగా అభిలాశించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.