**గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.

Publish Date : 09/11/2026
WhatsApp Image 2026-11-09 at 6.58.51 PM

*ఎన్నికల విధులు, నిబంధనలపై అధికారులు ముందస్తు అవగాహన కలిగి ఉండాలి.

**మూడు విడతల్లో 393 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు.

**– జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అధికారులకు తెలిపారు.

సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ, డి ఆర్ ఓ పి. గ్లోరీ, ఆర్డీవోలు కె.ఆర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఎం సూర్యారావు,
డిపిఓ పి. విజయ భాస్కర్, రిటర్నింగ్ అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికలను జిల్లాలో అధికారులు సమన్వయంతో ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఎలాంటి పొరపాట్లకు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాలని, విధుల కేటాయింపు నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

**ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన తప్పనిసరి.

ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ముందుగానే క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు నిబంధనల పుస్తకాలు తిరగేసి చూసే పరిస్థితి ఉండకూడదని, ప్రతి అంశంపై ముందస్తు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే వివిధ సమస్యలు, సందేహాలు, నిబంధనలకు సంబంధించిన అంశాలపై అధికారులు ముందుగానే స్పష్టత తెచ్చుకోవాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

**మూడు విడతల్లో 393 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు.

జిల్లాలో మొత్తం 393 గ్రామ పంచాయతీల పరిధిలోని 4,382 పోలింగ్ స్టేషన్లలో, 4,206 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు.

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు మూడు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని అన్నారు. మొదటి విడత నోటిఫికేషన్ నవంబర్ 13వ తేదీ, రెండవ విడత నవంబర్ 16వ తేదీ, మూడవ విడత నవంబర్ 19వ తేదీ విడుదల కానున్నట్లు తెలిపారు.

మూడు విడతలుగా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని అన్నారు. మొదటి విడత నవంబర్, 15వ తేదీ, రెండవ విడత నవంబర్ 18 వ తేదీ, మూడవ విడత నవంబర్ 21వ తేదీన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు.

పోలింగ్ అండ్ కౌంటింగ్ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
మొదటి విడత: నవంబర్ 26, 2026.
రెండవ విడత: నవంబర్ 29, 2026.
మూడవ విడత: డిసెంబర్ 02, 2026.
పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుందని, పోలింగ్ ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

**ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బంది సమీకరణపై ప్రత్యేక దృష్టి.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. జిల్లాలో 10,42,937 మంది ఓటర్లుగా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 20 మండలాలకు గాను, 4206 వార్డులలో మొదటి విడతగా 1548, రెండో విడతలో 1568, మూడవ విడతలో 1266, మొత్తం 4382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొదటి విడత ఎన్నికలకు సుమారు 5,038 మంది, రెండవ విడత ఎన్నికలకు సుమారు 5,056
మూడవ విడత ఎన్నికలకు సుమారు 4036
మొత్తం మూడు విడుదలకు గాను సుమారు 14,130 మంది సిబ్బంది అవసరం ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి సిబ్బంది వివరాలను ముందుగానే సేకరించి, అవసరమైన మేరకు విధులను కేటాయించాలని సూచించారు. గతంలో ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పొందిన సిబ్బంది కూడా ఈసారి విధిగా ఎన్నికల విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సర్పంచ్ పదవికి పోటీ చేయు రిజర్వేషన్ అభ్యర్థులు రూ. 3000/-, నాన్ రిజర్వేషన్ అభ్యర్థులు రూ. 1500/- ముందుగా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
వార్డ్ మెంబర్ గా పోటీ చేయు రిజర్వేషన్ అభ్యర్థులు రూ. 1,000/-, నాన్ రిజర్వేషన్ అభ్యర్థులు రూ. 500/- డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. రిజర్వేషన్ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని తెలిపారు.

**సమన్వయంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు బాధ్యత వహించాలి.

డివిజనల్ స్థాయి అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు, ఇతర శాఖల అధికారులు నిరంతరం పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్డీవోలు, పోలీసు డివిజన్లలోని ఎస్‌హెచ్‌వోలు తమ పరిధిలో ఎన్నికల నిర్వహణను అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షించాలని తెలిపారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా, పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఏర్పాట్లు వంటి అన్ని అంశాలపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ, డి ఆర్ ఓ పి. గ్లోరీ, ఆర్డీవోలు కె.ఆర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఎం సూర్యారావు, డిపిఓ పి. విజయ భాస్కర్, రిటర్నింగ్ అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు, డిపిఓ, డివిజనల్ పంచాయతీ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.