గోదావరి వరద ఉధృతికి కొద్దిపాటి నీరు చేరిన కనకా యలంక గ్రామాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ..
యలమంచిలి మండలం కనకాయలంక గ్రామానికి పడపై చేరుకున్న జాయింట్ కలెక్టర్ …
నీట మునిగిన లంక గ్రామ వాసులకు భరోసా …
కనకాయ లంకలో కలయ తిరుగుతూ ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాల ఆరా …
… జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకా యలంకలో గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లంకవాసుల యోగక్షేమలను తెలుసుకునేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం యలమంచిలి మండలం కనకా యలంకకు పడవపై చేరుకున్నారు. గ్రామంలోని రోడ్లపైకి నీరు రావడం పరిశీలించారు. మార్గం మధ్యలో అంగన్వాడి ఫ్రీ స్కూల్ లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా, అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా, పాము, కుక్క, తేలు కాటుకు అవసరమైన అత్యవసర మందులు ఉన్నాయా, వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఉందా అని ఆరా తీశారు. అలాగే అంగన్వాడీలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందజేస్తున్నారా, గుడ్లను ఇస్తున్నారా అని తెలుసుకుని, స్టాకు రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామంలో గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఎవరినైనా హాస్పిటల్లో చేర్పించారా అని అడిగి తెలుసుకున్నారు. కనకాయలంకలో నివాశితుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా, ఎవరికైనా ఆనారోగ్య సమస్యలు ఉన్నాయా, జ్వరాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుందని పునరావాస కేంద్రాలకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో లంక ప్రజలు జిల్లా జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, ప్రతి సంవత్సరం వరద సమయంలో పిల్లలు పాఠశాలలకు వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నారని, వరద ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి ఆలోచించి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ వారి యొక్క క్షేమాలను ఆరా తీయడంపై గ్రామ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే వాటర్ ప్యాకెట్లను ప్రతి ఇంటికి అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశుగ్రాసానికి కొరత లేకుండా అవసరమైన చర్యలను తీసుకోవడం జరిగిందని, పశుగ్రాసాన్ని కూడా అందజేస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట నరసాపురం ఆర్డీవో దాసిరాజు, యలమంచిలి తహసిల్దార్ పవన్ కుమార్, సచివాలయం సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.