గోదావరి పుష్కరాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
పుష్కరాల నిర్వహణ కోసం 22 శాఖల పరిధిలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇప్పటివరకు రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని, స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళా సంఘాల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. అన్ని శాఖలు జిల్లాల వారీగా పనుల పురోగతి, నిధుల వినియోగ వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాలని, పుష్కరాల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని 440 ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, తాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, లైటింగ్, వసతి, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రహదారులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక బస్సులు, రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
పుష్కరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు సమాచారం అందించేందుకు 135 భాషల్లో సేవలందించే కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, వైద్య బృందాలు, అదనపు ఆసుపత్రి పడకల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పుష్కరాలకు ముందే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునికీకరణ పనులు, పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, రాజమహేంద్రవరం–పోలవరం మధ్య జలమార్గంలో ఫ్లోటింగ్ పంటూన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, గోదావరి జలాల నాణ్యతను పరిరక్షిస్తూ పర్యావరణహితంగా పుష్కరాలను నిర్వహించాలని, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఘనంగా చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులతో కలిసి సమీక్షలో పాల్గొన్నారు.