గోదావరి క్రీడా సంబరాల వెబ్సైట్, గోడ పత్రిక ఆవిష్కరణ..
జిల్లాలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి గోదావరి క్రీడా పోటీలలో పాల్గొనాలి…
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరిక దారుణ్యానికి దోహదపడతాయి…
పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా ఉద్యోగుల కోసం గోదావరి క్రీడా సంబరాలు పేరిట ఏర్పాటు చేసిన క్రీడా పోటీల వెబ్ సైట్, గోడ పత్రికను శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గోదావరి క్రీడా సంబరాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సొంతంగా వెబ్సైట్ను కూడా రూపొందించడం జరిగిందన్నారు. వెబ్ సైట్ లో క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని, వీడియోలను, ఫోటోలను అన్నింటిని ఉంచడం జరుగుతుందని అందరూ చూడవచ్చు అన్నారు. క్రీడా పోటీలలో జిల్లాలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి రిజిస్టర్ కావాలన్నారు. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. రేపటినుండి టీమ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని కొరకు శనివారం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంపికలు ఉంటాయన్నారు. ఈ క్రీడా పోటీలలో క్రికెట్, క్యారమ్స్, టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, 100 మీటర్స్, 400 మీటర్స్ రన్నింగ్ పోటీలు, మహిళల కోసం ప్రత్యేక ఆటల పోటీలు ఉంటాయన్నారు. డివిజనల్ స్థాయిలో క్రీడా పోటీలకు క్రీడ మైదానాలను, సంబంధిత సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆర్డీవోలను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వెబ్సైట్ డిజైనర్ ఈడియం కిరణ్, డిటి సన్యాసిరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.