గుర్రపుడెక్కతో తయారుచేసిన వర్మి కంపోస్ట్ ను రైతులు విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో గ్రామ సమైక్య సభ్యులు గుర్రపు డెక్క ద్వారా తయారు చేస్తున్న వర్మీ కంపోస్ట్ యూనిట్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. తొలుత గ్రామ సమైక్య సభ్యులతో మాట్లాడుతూ తయారీ విధానాన్ని, ఎంతమంది యూనిట్ లో పనిచేస్తున్నారు, ఎన్ని రోజులకు కంపోస్ట్ తయారవుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో .. భీమవరం మండలం గొల్లవానితిప్ప, పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, ఆకువీడు మండలం సిద్దాపురం గ్రామాల్లో మండల, గ్రామ సమైక్య సభ్యుల ద్వారా గుర్రపు డెక్క తో వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించి నిర్వహించడం జరుగుతుందన్నారు. గుర్రపు డెక్క ద్వారా తయారుచేసే వర్మీ కంపోస్ట్ లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని, వాటిలో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, క్యాల్షియం వంటి విలువైన పోషక విలువలు ఉన్నాయన్నారు. ఈ వర్మి కంపోస్ట్ ను చేపలు, రొయ్యలు, పీతలు చెరువులలో వినియోగించుకోవచ్చని, అలానే ఉద్యానవన పంటలకు, వరి పొలాలలో వినియోగించుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు అన్నారు. కిలో ఒక్కింటికి రూ.12/- నుండి రూ.15/- వరకు ధరను నిర్ణయించడం జరిగిందన్నారు. టన్ను ఒక్కంటికి ధర రూ.12 వేలుగా ఉందన్నారు. ప్రస్తుతం ఒక్కొక్క యూనిట్ లో ఆరు టన్నుల వరకు వర్మీ కంపోస్ట్ అందుబాటులో ఉందని తెలిపారు. నేడు ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో అమ్మకాలను ప్రారంభించడం జరిగిందని, అమ్మ కాలు ప్రారంభాని కంటే ముందుగానే, వర్మీ కంపోస్ట్ ను బల్క్ గా ఒక రైతు బుక్ చేసుకున్నట్లు సమైక్య సభ్యులు తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గొల్లలకోడేరు లో కూడా వర్మీ కంపోస్ట్ అమ్మకాలను ప్రారంభించడం జరిగిందని, పది రోజుల తర్వాత గొల్లవాని తిప్పలో వర్మీ కంపోస్ట్ అమ్మకాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. వర్మీ కంపోస్ట్ తయారి వలన ఒక్కొక్క యూనిట్ లో 20 మందికి 50 రోజులు పాటు పని ఉంటుందని తెలిపారు. వర్మీ కంపోస్ట్ తయారు కావడానికి సుమారు రెండు, మూడు మాసాల సమయం పడుతుందన్నారు. నిరంతరాయంగా యూనిట్ లో పనిచేయాల్సిన అవసరం ఉండదని వారానికి రెండు మూడు రోజులు పని చేస్తే సరిపోతుంది అన్నారు. వర్మి కంపోస్ట్ మార్కెటింగ్ ను వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలు చేపట్టాలని సూచించారు. మహిళా సమైక్య సభ్యులకు అదనపు ఆదాయంతో పాటు, రైతులకు మంచి ప్రయోజనంగా ఉంటుందని, అలాగే గుర్రపు డెక్క కారణంగా ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని, బహుళ ప్రయోజనంగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఆకివీడు ఏపీఎం జి.శేషవేణి, ఎఫ్పిఓ సిసి బాలాజీ, సిసి కృష్ణ, మండల గ్రామ సమైక్య ప్రెసిడెంట్, సభ్యులు, తాహల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ఈ.మార్కండేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.