గడిచిన ఐదు సంవత్సరాలుగా వృద్ధులకు, అచేతన స్థితిలో ఉన్న వారికి ప్రతినిత్యం ఆహారాన్ని అందించాలంటే ఎంతో దాతృత్వం కలిగి ఉండాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న తులసి రాంబాబు సేవలు మన ముఖ్యమంత్రి చేపట్టిన P4 ను గుర్తు చేస్తున్నాయి..
సంపాదించిన దానిలో నిరంతరాయంగా మానవ సేవకు ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయం..
దాతృత్వం కలిగిన వ్యక్తులు మన ముఖ్యమంత్రి ప్రకటించిన పి4 మార్గదర్శకులుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు
వీరవాసరంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బుధవారం వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్ నందు అన్నదాత మల్ల తులసి రాంబాబు కొనసాగిస్తున్న అన్నదాన సేవలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించి వారి కుటుంబాన్ని అభినందించారు. ఆహార పదార్థాలను జిల్లా కలెక్టర్ స్వయంగా రుచి చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతమందికి ప్రతిరోజు ఆహారాన్ని అందిస్తున్నారు, ఎన్ని గ్రామాలకు మీ క్యారేజీలు పంపుతారు, రోజుకి సుమారు ఎంత ఖర్చవుతుంది, ఏమేమి ఆహార పదార్థాలు క్యారేజీలో ఇస్తారు, ఎన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు, తదితర వివరాలను తులసి రాంబాబును అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు వివరిస్తూ గత ఐదు సంవత్సరాలుగా ప్రతినిత్యం వీరవాసరం మండలంలోని 18 గ్రామాలలో సుమారు 200 మంది వృద్ధులకు మరియు అచేతన స్థితిలో వుండి ఆహార పదార్థాలను తయారు చేసుకోలేని స్టీల్ క్యారేజీల ద్వారా ఆహార పదార్థాలను వారి ఇంటి వద్దనే అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి బుధవారం, ఆదివారం కాయగూరలతో పాటు, మాంసాహారం కూరను కూడా అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రతినిత్యం కన్వినేషన్ హాల్ నందు వంటలు చేయించి, స్వయంగా పర్యవేక్షించడంతోపాటు ఒక వ్యక్తికి రెండు పూటలకు సరపడా ఆహార పదార్థాలను క్యారేజీ కట్టి వారి ఇంటికే పంపడం జరుగుతుందని తెలిపారు. వంటలు తయారు చేయడం, క్యారేజీలు కట్టడం, ఆటోలో తీసుకెళ్లి అందజేయడం మొత్తం పనులన్నింటికి ఐదు మంది సిబ్బంది నియమించడం జరిగిందని తెలిపారు. 200 మందికి భోజనాలు తయారు చేసి అందజేయడానికి సుమారు రోజుకు రూ. 8 వేల నుండి 10 వేల వరకు ఖర్చవుతుందని, అలాగే సంవత్సరానికి సుమారు రూ.30 లక్షల నుండి 35 లక్షల మధ్య ఖర్చు అవుతుందని, ఎవరి వద్ద ఏ విధమైన విరాళాలు సేకరించడం గాని, తీసుకోవడం గాని లేకుండానే ఈ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలుగా భగవంతుని దయతో నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని పురాణ కాలం నుండి వింటూనే ఉన్నామని, ఇటువంటి గొప్ప కార్యాన్ని ఒక వ్యక్తి గత ఐదు సంవత్సరాలగా నిరంతరాయంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఒక్కరోజు అన్నదానం చేయాలంటేనే చాలా వ్యయ ప్రయాసలతో ఉంటుందని, అటువంటిది ఐదు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగించడం అంటే మాటల్లో చెప్పలేనిది అన్నారు. రాంబాబు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమం చూస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన పి-ఫోర్ కార్యక్రమం గుర్తుకొస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుమేరకు దాతృత్వం కలిగిన వ్యక్తులు పి4 మార్గదర్శకులుగా నమోదుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంలో వీరవాసరం తహసిల్దార్ రామాంజనేయులు, ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, రాంబాబు సతీమణి వరలక్ష్మి, కుమార్తె గోవర్ధిని, తండ్రి శ్రీరామ మూర్తి, తదితరులు ఉన్నారు.