Close

కౌలు రైతులకి విరివిగా రుణాలను అందించాలి. పిఎంజెజెబివై, పి.ఎం ఎస్ ఎస్ వై, బీమా పథకాలలో ప్రతి ఒక్కరూ నమోదు అయ్యేలా చూడాలి.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 06/05/2025

మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశం (జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం మరియు జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలులో బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పథకాల లక్ష్యసాధనకు ప్రతి బ్యాంకు తమవంతు సహకారం అందించాలన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన కౌలు రైతులందరికీ రుణాల మంజూరుకు బ్యాంకర్లను ఆదేశించారు. విద్య, గృహ రుణాలను అందించేందుకు బ్యాంకర్లు మరింత శ్రద్ధ చూపాలి అన్నారు. విద్య, గృహ రుణాల మంజూరుకు సంబంధించి లబ్ధిదారులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారని, రుణాల మంజూరుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సత్వరమే రుణాలు అందించి పథకం విజయవంతం అయ్యేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి స్వస్త్య సురక్ష యోజన పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని, ఈ బీమా పథకాలు కింద నమోదైనవారు ఎవరైనా ప్రమాదానికి గురైతే వచ్చే బీమా పరిహారం ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నో పేద కుటుంబాలు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి సమయంలో ఇటువంటి పథకాలు ఆసరాగా నిలుస్తాయన్నారు. పిఎంజెజెబివై ప్రీమియం రూ.436/-, పిఎం ఎస్.ఎస్.వై ప్రీమియం రూ.20/- చెల్లించాల్సి ఉంటుందని, ఒక్కొక్క స్కీంకు రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా పొందవచ్చు అన్నారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు రుణాలు అందించేందుకు బ్యాంకర్స్ శ్రద్ధ చూపాలన్నారు. వీవర్స్ ముద్ర కింద తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించిన వారికి సబ్సిడీ విడుదల కాలేదని ఈ విషయమే బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఆయా బ్యాంకుల్లో నిర్దేశించిన కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్.సి కార్పొరేషన్, బి.సి కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ లకు సంబంధించి విడుదలైన మొత్తం, రుణాలకు మంజూరుకు చర్యలను వివరించారు. పీఎం స్వనిది పథకం కింద 13,605 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, 13,075 మంది లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పీఎం సూర్యఘర్ పథకం కింద14,577 మంది రిజిస్టర్ చేసుకోగా 1,742 మంది లబ్ధిదారులకు రుణాలను మంజూరు జరిగిందని తెలిపారు.

సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సంగీత కుమారి, నాబార్డ్ ప్రతినిధి నిష్యంత్, ఆర్బిఐ ప్రతినిధి రామకృష్ణ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.