Close

కోర్సుల ఎంపికలో ఒకరిని అనుకరించకుండా ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సులను ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు

Publish Date : 16/07/2025

బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాయలం రోడ్డులోని రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి (ఆర్ ఆర్ డిఎస్) డిగ్రీ కాలేజ్ లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత సిఎస్ఆర్ పండ్స్ 5 లక్షల 60 వేల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిగ్రీ కోర్సు ఏమి తక్కువ కాదని, కష్టపడి చదివితే ఏ కోర్సునందు అయినా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఇటీవల ఇంజనీరింగ్ కోర్సుల మీద మక్కువతో ఎక్కువమంది వాటిలో చేరి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తున్నామన్నారు. డిగ్రీ కోర్సులు, సాంకేతిక విద్య అవలంబించడం ద్వారా తక్కువ ఖర్చుతో సత్వర ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాయన్నారు. ఏదైనా ఒక విద్యలో రాణించడం, పట్టబద్రులు అవడం ముఖ్యమన్నారు. నేడు డిగ్రీ సబ్జెక్టుల్లో కూడా సబ్జెక్టు టీచర్లు కొరత ఉందన్నారు. చరిత్ర, సామాజిక, అర్థిక శాస్త్రాలకు ప్రాధాన్యత ఉందన్నారు. అలాగే బీకాం బిఎస్సిలో కంప్యూటర్ విద్య అనుసంధానంగా ఉండటం వల్ల ఈ డిగ్రీలకు కూడా ప్రాధాన్యత ఉందన్నారు. ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తాను ఆర్ఆర్డిఎస్ డిగ్రీ కాలేజీకి 10 కంప్యూటర్లు ఇవ్వడం పెద్ద విషయం కాదన్నారు, అది తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం ఉండాలనే సదుద్దేశంతో రాజకీయాలు, కుల మతాలకతీతంగా ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన కీర్తిశేషులు మూర్తి రాజుగారిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహోన్నత ఆశయంతో మూర్తిరాజు స్థాపించిన కళాశాలలకు ఏ సహాయము కావాలన్నా తన వంతుగా అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. మూర్తి రాజు విద్యాసంస్థలు అంటే తనకు ఎనలేని అభిమానం అన్నారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటే ఉపాధి అవకాశాలు కలుగుతాయని భవిష్యత్తు బాగుంటుందన్నరు. ఈ కళాశాలలో ముగ్గురు అధ్యాపకులు పీహెచ్డీ కలిగి బోధించడం మీరు అదృష్టంగా భావించాలన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ వీకేజే ప్రసూన మాట్లాడుతూ అడిగిన వెంటనే కంప్యూటర్లు అందించిన కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల తరఫున కలెక్టర్ ను సత్కరించి జ్ఞాపిక అందించారు. ముందుగా మూర్తి రాజు చిత్రపటానికి కలెక్టర్ నాగరాణి, ప్రిన్సిపాల్ ప్రసూన, ప్రముఖ నేత్ర వైద్యులు యు.వి.రమణ రాజు, తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిఎ ప్రథమ సంవత్సరంలో ఉన్నతమైన మార్కులు మార్కులను సాధించిన బిఆర్బి సుధీర్ కు కలెక్టర్ మెమెంటోను అందజేశారు మరికొందరు విద్యార్థులకు కూడా మెమెంటోలు అందించారు

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.కె. జ్ఞాన ప్రసూన, అధ్యాపకులు ఎస్.లక్ష్మీకాంతం, డాక్టర్ పి.అరవిందస్వామి, డాక్టర్ కె.శ్రీనివాసరావు, జి.ఉమామహేశ్వరి, డివివి సిహెచ్ సత్యనారాయణ, కంప్యూటర్ ల్యాబ్ అధ్యాపకులు జి.ప్రసాద్ బాబు, లైబ్రేరియన్ యల్.నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.